బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు… ఇలా సమాజంలో మన చుట్టూ ఉండే ఎవరైనా విభిన్నమైన మనస్తత్వాలు కలిగి ఉంటారు. కొందరు మనతో స్నేహం చేసి దగ్గరగా ఉంటే, కొందరు శత్రువులుగా ఉంటారు. ఇంకొందరు పైకి స్నేహం నటిస్తూనే లోలోపల మనపై ఈర్ష్య, అసూయ పెంచుకుని కుట్రలు పన్నుతారు. అలాంటి వారి గురించి తెలిస్తే మనం వారిని దూరం పెడతాం. అస్సలు దగ్గరికి రానివ్వం. మరి అలాంటి వారే కాదు, అలా మనం దూరం పెట్టాల్సిన వారు ఇంకొందరు ఉంటారట. అవును, మీరు విన్నది కరెక్టే. దీని గురించి దేవీ భాగవతంలో వివరించారు కూడా. ఈ క్రమంలో మనం దూరం పెట్టాల్సిన ఆ వ్యక్తులు ఎవరో… వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీకు కష్టాలు, సమస్యలు వస్తుంటే మీ చుట్టూ ఉన్నవారు కొందరు లోలోపల సంతోష పడతారు కదా. అలాంటి వారు ఎక్కువగా మనకు తారస పడుతుంటారు. అయితే మీకు గనక అలాంటి వ్యక్తులు ఎదురైతే వారిని అస్సలు దగ్గరకు రానివ్వకూడదట. ఎందుకంటే మీరు కష్టాలు, సమస్యల్లో ఉంటే వారు ఎంతో సంతోష పడుతూ మీకు ఇంకా హాని కలిగించేందుకు అవకాశం ఉంటుందట. కనుక అలాంటి వారిని దరిచేరనీయకూడదు.
ప్రతి మనిషిలోనూ ఏదో ఒక వర్గం పట్ల ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉంటాయట. అలా కాకుండా అసలు అలాంటి భావాలు లేని వారు, దేవున్ని నమ్మని వారి నుంచి దూరంగా ఉండాలట. ఎందుకంటే వారు మీలోని పాజిటివ్ శక్తిని లాక్కుని నెగెటివ్ శక్తిని ప్రసారం చేస్తారట. అందుకని వారి నుంచి కూడా దూరంగా ఉండాల్సిందే. మహిళలతో అక్రమ సంబంధాలను పెట్టుకునే పురుషులను అస్సలు నమ్మకూడదట. వారిని దగ్గరికి రానివ్వకూడదట. అలాంటి వారితో ఎప్పటికైనా ప్రమాదమేనట.
దోపిడీలు, దొంగతనాలు, మోసాలు, హత్యలు వంటి నేరాలు చేసే వారితో ఎప్పటికీ దూరంగానే ఉండాలట. వారు ఎవరైనా సరే దూరం పెట్టాల్సిందే. లేదంటే ఎప్పుడో ఒకప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందట. మీరంటే ఎప్పటికీ ఈర్ష్య, అసూయ, ద్వేషాలను కనబరిచే వారితో మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వారు సమస్యలను తెచ్చి పెడతారట. వారితో ఎప్పటికీ దూరంగా ఉండాల్సిందే.