Omega 3 Fatty Acids : మన శరీరానికి కావల్సిన పోషకాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఒకటి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. ఇవి ముఖ్యంగా సముద్రపు చేపల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే పలు రకాల శాకాహారాల్లోనూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మనకు లభిస్తాయి. అవిసె గింజలు, అవకాడో, చియా విత్తనాలు, బాదంపప్పు, ఆలివ్ ఆయిల్, జొన్నలు, రాగులు, కొర్రలు, అరికలు, ఊదలు, సామలు వంటి చిరుధాన్యాల్లోనూ మనకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా లభిస్తాయి. అందువల్ల వీటిని ఆహారంగా తీసుకుంటే మనం ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను పొందవచ్చు. వీటి వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
1. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత తరుణంలో చాలా మంది డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళనతో సతమతం అవుతున్నారు. అలాంటి వారు రోజూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
2. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల కంటి చూపు పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆహారాల వల్ల కళ్లలో శుక్లాలు రాకుండా చూసుకోవచ్చు. కంటి సమస్యలు తగ్గుతాయి.
3. గర్భిణీలు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలు అత్యంత తెలివిమంతులు అవుతారని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఆహారాల వల్ల పిల్లల్లో మెదడు చాలా యాక్టివ్‌గా పనిచేస్తుంది. దీంతో వారు చదువుల్లో అద్భుతంగా రాణిస్తారు. కమ్యూనికేషన్, సోషల్ స్కిల్స్ పెరుగుతాయి. వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడంతోపాటు మానసిక సమస్యలు రాకుండా ఉంటాయి.
4. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటుంది.
5. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను రోజూ తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. అధిక బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది. షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
6. శరీరంలో వాపులు అధికంగా ఉన్నవారు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకుంటే వాపులతోపాటు నొప్పులు కూడా తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులు ఉండే వారికి ఇది ఎంతగానో మేలు చేసే విషయం.
7. వయస్సు మీద పడితే ఎవరికైనా మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గుదల వంటి సమస్యలు వస్తాయి. కానీ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకుంటుంటే ఆయా సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. వృద్ధాప్యంలోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
8. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు 55 శాతం వరకు తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
9. చిన్నారులకు ఈ ఆహారాలను ఇవ్వడం వల్ల వారిలో శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది.
10. లివర్ సమస్యలు ఉన్నవారు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకుంటే లివర్ క్లీన్ అవుతుంది. అందులో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
11. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. నెలసరి సమయంలో స్త్రీలకు వచ్చే సమస్యలను తగ్గిస్తాయి.
12. నిద్రలేమి సమస్యలు ఉన్నవారు రోజూ ఈ ఆహారాలను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
13. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చర్మంపై ఉండే గజ్జి, దురద, దద్దుర్లు తగ్గిపోతాయి. చర్మం పగలకుండా మృదువుగా, తేమగా ఉంటుంది.
చేపలు, బాదంపప్పు, అవిసె గింజలు, చియా విత్తనాలు, చిరు ధాన్యాలను రోజూ తీసుకోవడం వల్ల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మనకు లభిస్తాయి. అయితే వైద్యుల సూచన మేరకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లకు చెందిన ట్యాబ్లెట్లను వాడవచ్చు.
సాధారణంగా పెద్దలకు రోజుకు 250 నుంచి 500 మిల్లీగ్రాముల మేర ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అవసరం అవుతాయి. ఈ పోషక పదార్థ లోపం ఉంటే వైద్యులు రోజుకు 1.1 గ్రాముల నుంచి 1.6 గ్రాముల మోతాదులో ట్యాబ్లెట్లను ఇస్తారు. వీటిని నెల రోజుల పాటు వాడాల్సిందిగా డాక్టర్లు సూచిస్తుంటారు. ఇక చిన్నారులకు రోజుకు 50 నుంచి 100 మిల్లీగ్రాముల మోతాదులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అవసరం అవుతాయి. ఇవి ఉండే ఆహారాలను రోజూ తీసుకుంటూ వైద్యుల సూచన మేరకు ట్యాబ్లెట్లను వాడుకుంటే పైన తెలిపిన ప్రయోజనాలను పొందవచ్చు.