Heart Transplant : ప్రపంచ వైద్య చరిత్రలో ఇదొక అద్భుతమైన ఘట్టం. మొట్ట మొదటిసారిగా వైద్య నిపుణులు ఓ అరుదైన శస్త్ర చికిత్స చేసి విజయం సాధించారు. ఓ వ్యక్తికి జన్యు మార్పిడి చేయబడిన పంది గుండెను అమర్చారు. ఈ క్రమంలోనే ఈ శస్త్ర చికిత్స విజయవంతమైంది. అవయవ మార్పిడి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాధితులకు ఈ వార్త ఎంతో ఊరటనిస్తోంది. వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తి గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్నాడు. అతనికి కచ్చితంగా గుండె మార్పిడి చేయాల్సి ఉంది. అయితే ఆర్టిఫిసియల్ హార్ట్ పంప్‌కు గానీ, ఇతర వ్యక్తుల నుంచి గుండెను తీసి అతనికి పెట్టడం కానీ చేయకూడదు. అతనికి ఉన్న సమస్య ప్రకారం.. అతనికి గుండె మార్పిడి అవసరమే.. కానీ అది అత్యంత క్లిష్టతరమైంది. దీంతో అతను పంది హృదయాన్ని తనకు అమర్చాల్సిందిగా దరఖాస్తు పెట్టుకున్నాడు.
ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్ 31వ తేదీన బెన్నెట్ దరఖాస్తుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర ప్రాతిపదికన అనుమతి ఇచ్చింది. దీంతో సైంటిస్టులు పంది నుంచి సేకరించిన గుండెకు జన్యు పరంగా పలు మార్పులు చేసి అనంతరం దాన్ని బెన్నెట్‌కు అమర్చారు.
పంది గుండెను మనుషులకు అమర్చాలంటే దానికి జన్యు పరంగా పలు మార్పులు చేయాల్సి ఉంటుందని సైంటిస్టులు తెలిపారు. సదరు గుండెను మనిషిలో అమర్చగానే శరీరం దాన్ని తిరస్కరించరాదు. అలాగే ఆ అవయవం పెరగరాదు. ఇందుకుగాను ఆ గుండెలో అవసరమైన జన్యు మార్పులు చేశారు. అనంతరం దాన్ని ఇటీవలే బెన్నెట్ కు అమర్చారు. దీంతో ఆ శస్త్ర చికిత్స విజయవంతం అయింది.
ప్రస్తుతం చాలా మంది అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న విషయం విదితమే. సరైన దాతల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అనేక రకాల అవయవాలను మార్పిడి చేసుకునేందుకు గాను ఎంతో మంది బాధలు లిస్ట్‌లో తమ పేర్లను చేర్చుకుని తమ పేరు ఎప్పుడు వస్తుందా.. అని వేచి చూస్తున్నారు. అయితే అలాంటి వారందరికీ ఆ సైంటిస్టులు ప్రస్తుతం చేసిన గుండె మార్పిడి శస్త్ర చికిత్స ఊరటనిస్తోంది. భవిష్యత్తులో ఇది మరింత మందికి అందుబాటులోకి వస్తే అప్పుడు అవయవ మార్పిడి బాధితులకు ఎంతగానో ఉపయోగం కలుగుతుందని భావిస్తున్నారు. దీని వల్ల లిస్ట్‌లో వేచి చూడకుండా బాధితులకు ఎప్పటికప్పుడు అవయవాలను మార్పిడి చేసుకునేందుకు వీలు కలుగుతుంది.