కొత్త కారు, టూవీలర్ లేదా ఇతర ఏదైనా వాహనం, వస్తువు కొన్నారా..? దాన్ని కొన్నామని అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తున్నారా..? లేదంటే విదేశాలకు టూర్ వెళ్లిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా..? ఇవే కాకుండా మీ విలాసవంతమైన జీవితానికి చెందిన ఫొటోలను, వివరాలను సోషల్ సైట్లలో షేర్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే వెంటనే మీరు ఇకపై అలాంటి వివరాలను పోస్ట్ చేయరు సరికదా, ఇప్పటికే ఉంటే ఆ వివరాలను తీసేస్తారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
పెద్ద నోట్ల రద్దు దగ్గర్నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు షాకుల మీద షాకులను ఇస్తూనే ఉంది. అయితే త్వరలో మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అది ట్యాక్స్ చెల్లించని వారికి. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ ఏం చేస్తుంది అనే కదా మీ డౌట్. ఏమీ లేదండీ.. కేంద్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ లిమిటెడ్ అనే కంపెనీతో ఓ ప్రాజెక్టు విషయమై ఇప్పటికే కాంట్రాక్టు కుదుర్చుకుందట. ఆ ప్రాజెక్టు పేరు ప్రాజెక్ట్ ఇన్‌సైట్. దీని లక్ష్యం ఏమిటంటే… ఫేస్‌బుక్, ట్విట్టర్ సహా దాదాపుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో యూజర్లు పోస్టు చేసే పైన చెప్పిన విలాసవంతమైన కేటగిరీలకు చెందిన పోస్టులను స్కాన్ చేయడం, వారి ఆదాయ వివరాలు సేకరించడం, ట్యాక్స్ చెల్లించని వారికి నోటీసులు జారీ చేసి, ముక్కు పిండి ఇన్‌కమ్ ట్యాక్స్ వసూలు చేయడం.
ఇందుకు గాను ఇప్పటికే ఈ ప్రాజెక్టు ట్రయల్ రన్ నడుస్తుందట. రూ.1000 కోట్ల బడ్జెట్‌ను దీనికి కేటాయించినట్టు తెలిసింది. అంటే ఇకపై మీరు సోషల్ సైట్లలో షేర్ చేసే నూతన వస్తువులు, వాహనాలు ఇతర విషయాలు ఆదాయపు పన్ను వారికి తెలుస్తాయన్నమాట. వారు మీ వివరాలను సేకరించి మీరు ఇన్‌కం ట్యాక్స్ సరిగ్గా కడితే ఓకే. లేదంటే రైడ్ చేస్తారు. అయితే ఇక్కడ ఓ చిక్కు ఉంది. నిజానికి సోషల్ సైట్లు, యాప్‌లు ఏవైనా సరే అందులో ఉండే యూజర్ల డేటాను ఎవరూ తీసుకోవడానికి, స్కాన్ చేయడానికి లేదు. ఆయా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు, యాజ్‌ల యాజమాన్యాలు అందుకు గాను ప్రత్యేకమైన ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను యూజర్లకు ఇస్తాయి. మరి కేంద్ర ప్రభుత్వం వారు యూజర్ల డేటాను ఎలా తీసుకుంటారో, ఆ ప్రాజెక్టును ఎలా అమలు చేస్తారో చూడాలి..!