డబ్బు ప్రభుత్వం తాయారుచేస్తుంది అంటే R.B.I అలాంటపుడు మనదేశంలో చాల మంది పేద ప్రజలు ఉన్నారు. డబ్బులు ఎక్కువ ముద్రించి పేద ప్రజలకు ఎందుకు ఇవ్వరు, ఎక్కువ డబ్బులు ఎందుకు ముద్రించరు, ముద్రిస్తే సమస్యలు ఏంటి..? ఈ ప్రశ్నకు డైరెక్టుగా సంబంధం లేక పోవచ్చు గానీ… గుర్తు చేసుకోవడం అసందర్భం కాదు! కరెక్ట్ గా ఇదే సందేహం అయిదేళ్లు ఏపీ కి సీఎంగా పని చేసిన జగన్ రెడ్డికి కూడా ఒక దశలో వచ్చింది, డబ్బుని కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుందని అనుకున్నారేమో తెలియదు! పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించి, వారికి పునరావాస కాలనీలు నిర్మించాలంటే ఇరవై వేల కోట్లు అవసర మవుతాయని, అంత ధనం తనవద్ద లేదని, రాష్ట్రానికి అంత శక్తి లేదనీ, కేంద్రమే సాయ పడాలని చెప్పారు, వారి కంట్రోల్లో ఉన్న రిజర్వ్ బ్యాంకు మనకు అంత కరెన్సీ ముద్రించి పంపితే నేరుగా మీ ఖాతాల్లో జమ చేస్తానని ఉదారంగా ప్రకటించారు.
ఎన్నేళ్ళు గడిచినా తమకు పరిహారం రావడం లేదని విసిగిపోయి ఆవేదనగా చెప్పిన నిర్వాసితులతో జగన్ రెడ్డి అప్పటికి సముదాయింపుగా , వారికి అర్థమయ్యే శైలిలో అని ఉండవచ్చు. నిజమే…. జగన్ రెడ్డి చెప్పినది అక్షరాలా నిజం, అయితే అలా నోట్ల కట్టలు అచ్చు వేసి ఎలా బడితే అలా పంపడమే కుదరదు, కారణం ఏమంటే…కరెన్సీ ముద్రించడం తేలికే, కానీ సదరు కరెన్సీ కి తగిన విలువ తేవడమే కష్టం, కాగితం కరెన్సీ అనగానే అది వట్టి పేపరేగా? ఏం పోయింది! అనుకోరాదు, దానికి చాలా లెక్కలు ఉంటాయి. ఏ వస్తువు కైనా మనం దానికున్న విలువ మేరకు డబ్బు చెల్లించి కొనుగోలు చేస్తున్నాము అంటే అర్ధం, దానికి ఆ నిజ విలువ ఉండబట్టే, దానికి వాస్తవంగా ఆ విలువ ఉందని రిజర్వు బ్యాంకు వారు మనకు కరెన్సీ నోటుపై బ్యాంకు గవర్నర్ సంతకంతో కూడిన హామీ ఇస్తుంటారు. అది ఆరు నూరైనా ఆ నోటుకు ఆ విలువ కి గ్యారంటీ ఇవ్వడమన్న మాట! సదరు కరెన్సీ కి సమానమైన వస్తువుని గానీ లేదా బంగారం గానీ మీకు ఇస్తామని, అది చెల్లుబాటు కాకపోవడం అంటూ ఉండదని వారు హామీ పడతారని అర్దం.
ఇక కరెన్సీకి విలువ విషయానికి వస్తే…దేశంలో ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి అయ్యే పంటలు, పారిశ్రామిక వస్తు సముదాయం( దీన్నే స్థూల జాతీయోత్పత్తి అంటారు), ఎగుమతులు, రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న బంగారం నిల్వలు, విదేశీ మారకపు నిల్వలు, ముఖ్యంగా ఏ దేశ మైనా అంగీకరించే డాలర్లు మొత్తాన్ని లెక్క కడతారు. ఆ మేరకు కరెన్సీ ఎంత ముద్రించాలో లెక్కలు వేస్తారు, వాటి విలువని ఒక్క చోట చేర్చి మదింపు చేస్తారు , అదే మొత్తాన్ని వివిధ రూపాయల విలువలతో ప్రింట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. అప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ లోకి సదరు కరెన్సీ వచ్చి చేరుతుంది, అక్కడికి రిజర్వ్ బ్యాంకు పని ముగిసినట్టే, ఇది నిరంతర ప్రక్రియ…ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల యుగం వచ్చింది, భౌతికంగా కరెన్సీ నోట్లు ఇవ్వం, కేవలం సెల్ ఫోన్ పై వేళ్ళు ఆడించి డబ్బు బదిలీ చేస్తాం, ఒక విధంగా రిజర్వు బ్యాంకు చేసే పనినే మనం చేస్తున్నాము, ఇది కూడ కరెన్సీ ప్రింటు చేయడం లాంటిదే అనుకోవచ్చు.
ఇటీవల ఆఫ్రికా లో బడుగు దేశమైన జింబాబ్వే ఆర్థికంగా దివాలా తీసింది, ఆ దేశంలో ఒక కప్పు చాయ్ తాగాలంటే , ఒక బ్రెడ్ కొని తినాలంటే అర చేతిలోకి పట్టే కరెన్సీ కట్ట ఇవ్వాలి, దేశంలో ఎక్కడ చూసినా నగదు నోట్లు గుట్టలు గుట్టలుగా పడి కనిపించాయి, వాటికి ఏ విలువా లేదు, దాన్ని ఏ దేశమూ గుర్తించి తీసుకోదు. తల కింద దిండ్లుగా చేసుకుని పడుకోవచ్చు, దొంగల భయం కూడా అక్కర్లేదు.. తమ వద్ద డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నామని, చేత కాని ప్రభుత్వం కనీసం దాన్ని కూడా సమకూర్చ లేక పోతోందని జనం గగ్గోలు పెట్టగా రేయింబవళ్ళు ప్రింటింగ్ మిషన్లు నడిపి ప్రజల కోర్కె తీర్చి వద్దంటే డబ్బు అన్నట్టు పంచారు! అలా ఉంటుంది జబ్బున పడిన ఆర్థిక వ్యవస్థ తీరు, కనీసం ప్రింటు చేసిన ఖర్చులు కూడా రావు, భారత్ లాంటి సువిశాల వనరులు, మేధస్సు, కష్టించే ప్రజలు ఉన్న దేశానికి ఆ దుస్థితి ఎన్న టికీ రాదు. మన రూపాయి బక్క చిక్కి విలువ కోల్పోయే ప్రశ్నే లేదు, డాలర్ మారకపు విలువతో పోల్చుకుంటే ఒడిదుడుకులు కనిపించవచ్చు, అంత మాత్రాన రూపాయి విలువ పూర్తిగా దిగజారినట్టు దిగులు పడరాదు , మనం నిశ్చింతగా ఉండవచ్చు, అదే ఇండియన్ కరెన్సీ గొప్పతనం. మన ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ప్రపంచ టాప్ 5 లో ఒక వ్యవస్థగా ఎదిగింది.