గుప్పెట మూసి ఉన్నంత సేపే దానికి విలువ ఉంటుంది, ఒకసారి తెరిచేస్తే ఇంకా దానిని ఎవరూ పట్టించుకోరు.. ఉత్తర కొరియా దగ్గర అణు బాంబులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కదా , సరే వాళ్ళు మదం ఎక్కి అమెరికా మీద అణుబాంబు వేసారు అనుకుందాం, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి. ఉత్తర కొరియా – అమెరికా మధ్య దూరం 10,000 కిలోమీటర్ల పైనే, అంత దూరమున్న లక్ష్యాలపై గురిపెట్టాలంటే శక్తివంతమైన ఖండాంతర క్షిపణి వ్యవస్థ ఉత్తర కొరియా దగ్గర ఉండాలి.. ఇప్పటివరకూ ఉత్తర కొరియా దగ్గర అణ్వాయుధాలున్నాయి అనేది ప్రచారం మాత్రమే, వారి నిజమైన శక్తి సామర్ధ్యాలు ఇప్పటికీ రహస్యమే.. సరే వారి దగ్గర భయంకరమైన అణు సాంకేతికత ఉందనే అనుకుందాం, అమెరికా లో ఒక నగరాన్ని వారు టార్గెట్ చేసి నాశనం చేసారనే అనుకుందాం.. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి?
అమెరికా ఊరుకుంటుందా? దక్షిణ కొరియా వంటి మిత్రదేశాల సహకారం తీసుకుని వెంటనే ఉత్తర కొరియా మీద ప్రతిదాడి చేస్తుంది కదా! ఆ తర్వాత ఉత్తర కొరియా కి మద్దతుగా రష్యా, చైనా వస్తాయి.. ఈ రెండు దేశాల దగ్గర శక్తివంతమైన అణ్వాయుధాలు ఖచ్చితంగా ఉన్నాయి.. ఇంకేముంది 3 వ ప్రపంచ యుద్ధం ప్రారంభం..
ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉత్తర కొరియా కి ఆర్ధిక స్థిరత్వం లేదు, 60% పైగా ప్రజలు కటిక పేదరికంలో మగ్గుతున్నారని ఒక అంచనా.. ఉన్న కాస్త డబ్బు, ఈ యుద్ధం మీద తగలేసే సాహసం ఆ దేశ ఏకైక పాలక నియంత కిమ్ జోన్ యంగ్ చేయలేడు.. అమెరికా లాంటి ఆర్ధిక, సాంకేతిక దిగ్గజాన్ని ఢీ కొట్టడం అంటే పిల్లాటలు కాదని కిమ్ కి చాలా స్పష్టంగా తెల్సు, కాబట్టి ఈ గుప్పెట మూసి, మా దగ్గర అణుబాంబు ఉంది జాగ్రత్త, అని పసిపిల్లల్ని బూచోడి కి ఇచ్చేస్తాం అని భయపెట్టే తల్లిలా నటిస్తుంది తప్ప, వాటిని వాడే సాహసం చేయదు.. కాకపోతే పిచ్చోడి చేతిలో రాయి ఉన్నదంటే భయపడక తప్పదు కదా.