మామూలుగా కార్లో ఎయిర్ బాగ్ స్టీరింగ్ వద్ద అమర్చబడి ఉంటుంది. బ్యాగ్ వెనుక, అది ఉబ్బడానికి కావల్సిన పరికరం అమరుస్తారు. వేగంగా వెళ్తున్న కారు దేన్నైనా ఢీకొడితే దాని వేగం ఉన్నపళంగా తగ్గిపోతుంది. ఎయిర్ బ్యాగ్‌లు ఇలాంటప్పుడే కావాలి. ఉన్నపళంగా ఇలా వేగం తగ్గిపోయినప్పుడు, ఎయిర్ బ్యాగ్‌లు రావటానికి తగిన సూచనలందాలి. ఇందుకోసం ఏక్సిలరోమీటర్ (accelerometer) అనే ఒక చిప్ వాడతారు. ఎంత త్వరగా వేగం తగ్గితే ఇది అంత గొప్ప ఫోర్స్ సృష్టిస్తుంది. అంటే ఇది వేగం యొక్క మార్పును గుర్తిస్తుంది.
మనం మామూలుగా బ్రేక్ వేసినప్పుడు అంత ఫోర్స్ ఏర్పడదు. సరిపడా ఫోర్స్ నిర్మాణమైతే ఈ ఏక్సిలరోమీటర్ మరొక సర్క్యూట్ కు సిగ్నల్ రూపంలో సూచనలందిస్తుంది. దీనిని ఎయిర్ బ్యాగ్ సర్క్యూట్ అంటారు. ఇది వేడి పుట్టించే పదార్థం ద్వారా విద్యుచ్ఛక్తిని పంపుతుంది. ఆ పదార్థం ఒక రసాయన పేలుడు పదార్థాన్ని మండిస్తుంది. పాత ఎయిర్‌బ్యాగ్‌లు సోడియం అజైడ్‌ను వాటి పేలుడు పదార్థంగా ఉపయోగించాయి, కొత్త వివిధ రసాయనాలను ఉపయోగిస్తాయి.
రసాయన పదార్థం కాలిపోతున్నప్పుడు, అది స్టీరింగ్ వీల్ వెనుక ప్యాక్ చేయబడిన నైలాన్ బ్యాగ్‌లోకి భారీ మొత్తంలో హానిచేయని వాయువును (సాధారణంగా నైట్రోజన్ లేదా ఆర్గాన్) ఉత్పత్తి చేస్తుంది. బ్యాగ్ డ్రైవర్ ముందు ఉబ్బుతుంది. బ్యాగ్ సజావుగా విప్పడానికి టాల్కమ్ పౌడర్ వంటి సుద్ద పదార్థంతో పూత పూయబడి ఉంటుంది. ఇదంతా 0.04–0.1 సెకన్లలో జరుగుతుంది. డ్రైవర్ బ్యాగ్‌కు నెట్టుకుంటాడు. ఇది బ్యాగ్‌లో ఉండే వాయువు దాని అంచుల చుట్టూ ఉన్న చిన్న కన్నాల ద్వారా బయటకు వెళ్లేటట్లు చేస్తుంది. కారు ఆగే సమయానికి, బ్యాగ్ పూర్తిగా సంకోచించిపోతుంది.