వాట్సప్… ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 100 కోట్ల మందికి పైగా దీన్ని వాడుతున్నారు. మన దేశంలోనైతే వాట్సప్‌ను వాడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. ఇతర అన్ని ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్స్‌తో పోలిస్తే వాట్సప్‌ను వాడేవారు ఎక్కువనే చెప్పవచ్చు. ఎన్ని కొత్త ఫీచర్లను కల్పించినా ఇతర యాప్‌లు ఏవీ వాట్సప్‌కు పోటీ ఇవ్వలేకపోయాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, వాట్సప్ వరల్డ్ వైడ్‌గా ఎంత పాపులర్ అయిందో. అయితే చాలా మందికి తెలియని పలు ఉపయోగకరమైన ట్రిక్స్ వాట్సప్‌లో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాట్సప్‌లో ఏదైనా టెక్ట్స్ మెసేజ్‌లను టైప్ చేసినప్పుడు ఆ మెసేజ్ బోల్డ్‌గా కనిపించాలంటే సింపుల్‌గా సదరు పదాలకు ముందు, వెనుక ఒక స్టార్ మార్క్‌ను యాడ్ చేయండి. అదెలాగంటే ఉదాహరణకు Rama is a good boy. అని వాక్యం ఉందనుకుందాం.
అందులో good అనే పదాన్ని bold గా చూపించాలంటే దానికి ముందు, వెనుక *good* అని యాడ్ చేస్తే చాలు. అప్పుడు good అనే పదం బోల్డ్ అవుతుంది. అదేవిధంగా ఇటాలిక్స్ రాయాలంటే అండర్‌స్కోర్ _ ఉంచాలి. అదే పదాన్ని స్ట్రైక్ త్రూ చేసినట్టుగా రావాలంటే ~ మార్క్‌ను యాడ్ చేస్తే సరి. వాట్సప్ లో వాయిస్ మెసేజ్‌లను కూడా సులభంగా పంపుకోవచ్చు. సింపుల్‌గా రికార్డ్ బటన్ ను ప్రెస్ చేసి సెండ్ చేస్తే చాలు. దాంతో అవతలి వ్యక్తులకు మన వాయిస్ మెసేజ్ వెళ్లిపోతుంది. దీంతో అవతలి వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వాయిస్ ను మళ్లీ మళ్లీ వినవచ్చు. వాట్సప్‌లో పొరపాటున ఏవైనా మెసేజ్‌లను డిలీట్ చేశారా..? అయితే ఏం ఫర్వాలేదు. ఎందుకంటే అలా డిలీట్ చేసిన మెసేజ్‌లను మళ్లీ పొందవచ్చు. అదెలాగంటే మీరు వాడుతున్న వాట్సప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి. దీంతో పోయిన మెసేజ్‌లు అన్నీ వస్తాయి.
వాట్సప్‌లో మనం అవతలి వ్యక్తుల మెసేజ్‌లను చదవగానే వారికి మనం ఆ మెసేజ్‌ను చదివినట్టుగా సులభంగా తెలిసిపోతుంది. డబుల్ టిక్ వస్తుందిగా. అదే. అలా వచ్చిందంటే మనం అవతలి వ్యక్తుల మెసేజ్‌లను చదివినట్టే. అయితే ఇది కొన్ని సందర్భాల్లో మనకు ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ క్రమంలో అలా మెసేజ్‌లను చదివినా, చదవనట్టుగానే కనిపించేలా చేయాలంటే అందుకు వాట్సప్‌లో సెట్టింగ్స్, అకౌంట్, ప్రైవసీ, రీడ్ రిసీట్స్ అనే విభాగంలోకి వెళ్లి అక్కడ ఉండే ఆప్షన్లను డిజేబుల్ లేదా ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. వాట్సప్‌లో మనల్ని ఒక్కోసారి ఇరుకున పెట్టే అంశం ఇంకోటి ఉంది. అదే లాస్ట్ సీన్ టైం. మనం వాట్సప్‌ను చివరి సారిగా ఎప్పుడు ఓపెన్ చేశామో అది చెప్పేస్తుంది. అయితే అలా తెలియకుండా ఉండాలంటే సెట్టింగ్స్, అకౌంట్, ప్రైవసీ, లాస్ట్ సీన్ అనే ఆప్షన్‌ను అన్ చెక్ చేస్తే సరి. దీంతో చివరి సారి మనం వాట్సప్‌లో ఉన్న సమయం ఇతరులకు కనిపించదు.
వాట్సప్‌లో మనం ఏదైనా గ్రూప్‌లో లేదా ఎవరైనా ఒక వ్యక్తితో చాట్ చేసేటప్పుడు సంభాషణను కొంత సేపు ఆపదలిస్తే అప్పుడు మ్యూట్ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే దాన్ని ఎలా ఎనేబుల్ చేయాలంటే చాట్ విండో పై భాగంలోకి వెళ్లి అక్కడ ఉండే మూడు నిలువు చుక్కలు (డాట్స్)ను క్లిక్ చేసి అందులో వచ్చే మ్యూట్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే చాలు. దీంతో ఆ చాటింగ్ మ్యూట్ అయిపోతుంది. మళ్లీ కావాలనుకున్నప్పుడు దాన్ని తిరిగి అన్‌మ్యూట్ చేయవచ్చు.