ఉత్తర అమెరికా ఖండానికి (అలాగే దక్షిణ అమెరికాకు కూడా) అట్లాంటిక్ సముద్రం మీదుగా కొన్ని వందల ఏళ్ళ పాటు సబ్-సహారన్ ఆఫ్రికాలోని ఆఫ్రికన్లను బానిసలను చేసి తీసుకువెళ్ళారు. ప్రధానంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని వివిధ రేవు పట్టణాల నుంచి ఈ బానిసల వ్యాపారం జరిగింది అట్లాంటిక్ మహాసముద్రానికి అటువైపు ఆఫ్రికా, ఇటువైపు అమెరికాస్ ఉంటాయి. ఆఫ్రికా నుంచి అమెరికా, బ్రెజిల్, కెనడా, యుకె వంటి పలు దేశాలకు ఈ బానిసల తరలింపు జరిగింది. కావడానికి, అమెరికా, కెనడాల్లాగానే బ్రిటన్ వలస రాజ్యమైనా కూడా ఆస్ట్రేలియాకు ఈ అట్లాంటిక్ బానిసల వ్యాపారంలో పాత్ర లేదు, తద్వారా ఆఫ్రికన్-అమెరికన్ల తరహాలో ఆఫ్రికన్-ఆస్ట్రేలియన్లు లేరు. దాని అర్థం అసలు బానిసలే లేరని కాదు. ఆ బానిసలు ఆఫ్రికన్లు ఎందుకు కాలేదన్నది తెలుసుకోవచ్చు కొంచెం ఆ దేశపు చరిత్ర చరిత్ర పరిశీలిస్తే:
ఆస్ట్రేలియా అమెరికాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా కాలనీ అయింది. యునైటెడ్ స్టేట్స్ స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాకా (1780లు) బ్రిటన్‌కి నేరస్తులకు ద్వీపాంతరవాస శిక్ష వేస్తే ఎక్కడికి పంపించాలన్నది ఇబ్బంది అయ్యింది. అలాంటప్పుడే 11 ఓడల్లో నేరస్తులను ఆస్ట్రేలియాకు పంపించారు. అలా ఆస్ట్రేలియాలో మొట్టమొదటి కాలనీ ఏర్పాటుచేశారు. ఈ కాలనీకి రెండు రకాల జనం వెళ్ళారు. స్వేచ్ఛగా కొత్తదేశంలో అవకాశాల కోసం వెళ్ళినవారు, ద్వీపాంతరవాస శిక్షలు పడి తలరించబడ్డ నేరస్తులు. ఈ నేరస్తులను తాము పూర్తిచేయాల్సిన శిక్షా కాలం అంతటా బానిసల్లానే వ్యవహరించేవారు. ప్రైవేటు ఆస్తిపరులకు వీళ్ళను చవకగా లీజుకు ఇచ్చేది ప్రభుత్వం. ఆ లీజు ముగిసేవరకూ వారితో అక్కడ గొడ్డుచాకిరీ అనదగ్గ స్థాయిలో పనిచేయించుకునేవారు.కాబట్టి, ప్రత్యేకించి బానిసలను కొనుక్కోవడం అన్న కాన్సెప్టు మొదటి దశలో లేదు.
1830ల్లో ఈ నేరస్తుల తరలింపు ఆపెయ్యాలని కొందరు మధ్యతరగతి నేరస్తులు-కాని సాధారణ పౌరులు విజ్ఞప్తి చెయ్యడం ప్రారంభమైంది. ఇందుకు ప్రధానమైన కారణం తమబోటి మధ్యతరగతి ఉద్యోగులు లేదా పనివారు ఈ నేరస్తుల కారణంగా పని కోల్పోతున్నారన్నది. అలాగే, నేరస్తుల వల్ల ఆస్ట్రేలియాలో నేరాలు పెరిగిపోతున్నాయన్నది మరొక కారణం. సంపన్నులైన భూస్వాములు సహజంగానే దీన్ని వ్యతిరేకించారు. అయితే, మెల్లిగా 1840లో తాత్కాలికంగానూ, 1853 నాటికి పూర్తిగా అధికారికంగానూ ఈ నేరస్తుల తరలింపు ఆగిపోయింది. తరలింపు ఆగిపోయేనాటికి లక్షా 50 వేలమంది నేరస్తులు ఆస్ట్రేలియా చేరుకున్నారు. వీరు మెల్లిగా శిక్షా కాలం పూర్తిచేసుకుని స్వేచ్ఛా పౌరులు అయిపోయారు. ఇందులో 99 శాతం మంది గ్రేట్ బ్రిటన్‌కు చెందినవారే. కేవలం ఒక్క శాతంలో భారత్, కెనడా, హాంగ్‌కాంగ్, కరేబియన్ వంటి ఇతర బ్రిటీష్ కాలనీల వారు ఉన్నారు.
1850 నాటికే బ్రిటీష్ సామ్రాజ్యం ఆఫ్రికన్ బానిసల వ్యాపారాన్ని అధికారికంగా నిషేధించేసింది. ఇక ఆఫ్రికన్ బానిసల దిగుమతి సాధ్యం కాదు. 1830-50ల్లో ఆస్ట్రేలియన్లు భారతదేశం నుంచి కాంట్రాక్టు పనివారిని దిగుమతి చేసుకున్నారు. ఐదేళ్ళు పనిచేసి తర్వాత భారతదేశం వెళ్లిపోయేలాగా. వీళ్లని కూలీ అనేవాళ్ళు. వీళ్ళకు తిండి, బట్ట, వసతి వంటివన్నీ ఇచ్చి ఆస్ట్రేలియన్ యజమానులు పనిచేయించుకోవాలని అగ్రిమెంట్ అయితే వాళ్ళను అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉంచేవారు ఆ యజమానులు. బానిసల కన్నా ఘోరం వాళ్ళ స్థితి. బట్ట లేకుండా, తిండి లేకుండా చేసేవారు. 1850ల తర్వాత కూలీలుగా చైనీయుల్ని దిగుమతి చేసుకునేవారు. మళ్ళీ అదే ట్రీట్మెంట్. వీళ్ళు ఈ దారుణమైన పరిస్థితులు తట్టుకోలేక పారిపోతే కాంట్రాక్టు ఉల్లంఘన పేరిట జైల్లో వేసేవారు, తర్వాత వాళ్ళ దేశంలో జైళ్ళకు తరలించేవారు.
అయితే, ఎవరిని దిగుమతి చేసుకున్నా ఐదేళ్ళ కాంట్రాక్టుకే పరిమితం. అక్కడ మట్టుకు శాశ్వతంగా ఉండనిచ్చేవారు కాదు. ఆస్ట్రేలియా చరిత్ర సమస్తం ఆదిమ జాతులపై పీడన పరాయణత్వమే కదా. మొదట్లో వారిని బానిసలుగా చేసి పనిచేయించుకునేవారు. 1860ల్లో బానిసత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలూ గట్రా వచ్చాయి. (బహుశా అమెరికా అంతర్యుద్ధ ప్రభావమేమో!) జీతాలిచ్చే పనిచేయించుకోవాలని చట్టం వచ్చింది. సరే చట్టప్రకారం వీళ్ళ జీతాలు బ్యాంకు ఖాతాల్లో వేసేవారు. ఆ బ్యాంకు ఖాతాలు పాపం వాళ్ళ చేతుల్లో ఉండేవి కాదు. ఎటొచ్చీ మళ్ళీ బానిసత్వమే. 1901 నుంచి 1970ల వరకూ విదేశాల నుంచి అక్కడ వైట్ ఆస్ట్రేలియా లేక తెల్ల ఆస్ట్రేలియా విధానం ఉండేది. దాని ప్రకారం వలసవచ్చేవారు బ్రిటీష్ దీవుల వారసత్వం కలిగిన తెల్లవారే అవ్వాలి. వారికే ఆస్ట్రేలియా పౌరసత్వం లభిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మెల్లిగా దీన్ని మిగిలిన ఐరోపా తెల్లవారికీ విస్తరించారు. చివరకు 1970ల్లో పూర్తిగా సడలించేశారు. ఈ కారణాలన్నిటి రీత్యా ఆఫ్రికన్లు ఆస్ట్రేలియాలో తక్కువ. ఐతే, 1970ల తర్వాత నల్లజాతికి చెందినవారు, ఆఫ్రికన్లూ కూడా మెల్లిగా ఆస్ట్రేలియాకు వలస వస్తున్నారు. ఇప్పుడు ఒక మూడు లక్షల వరకూ వారి జనాభా ఆస్ట్రేలియాలో ఉంది.