పూర్వం దండకారణ్యంలో గౌతముడనే మహర్షి.. బ్రహ్మను గూర్చి కఠోర తపస్సు చేశాడు. ఆ ముని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ.. ప్రత్యక్షమయ్యి, నీవు ఏ ధాన్యం నేలపై విత్తినా, అది వేసిన జాములో పంట అవుతుంది అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. గౌతముడు సంతోషించి తన భార్య అహల్యతో శతశృంగమనే పర్వత ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకొని, బ్రహ్మ ఇచ్చిన వరమహిమతో, అతిథి సత్కారాలు చేస్తూ జీవనం సాగించారు.
ఆ కాలంలో ఒక 12 సంవత్సరాలు కరువువచ్చి పంటలు పండకపోయినా, వరమహత్యంతో గౌతముడు జాముకో పంట పండించి అన్నార్తుల ఆకలి తీర్చాడు. పుష్కరం కరువు తర్వాత, వర్షాలు కురిసి అంత సస్యశ్యామలం అయింది. అందరూ ఐశ్వర్యవంతులయ్యారు. ఐశ్వర్యం గౌతముడుపై అసూయను పెంచింది. కొందరికి గౌతముడుపై దోషారోపణచేసి, అతణ్ణి వెళ్ళగొట్టాలని బుద్ధి పుట్టింది. వెంటనే చావుకు సిద్ధంగా ఉన్న బక్క ఆవును తెచ్చి గౌతముడి పొలంలో వేసి, ఆ ముని గోహత్య చేసాడని నెపం మోపారు. గౌతముడ్ని,అహల్యను అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. ఆ మునిదంపతులు హిమాలయాలకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేసి, ఆయన ప్రతక్ష్యం కాగానే తమ విషాదగాథను వినిపించారు.
శంకరుడు తన జటాజూటంలోని ఒక గంగాధరను గౌతముడికి ఇచ్చి, దానిని తన పొలంలో చచ్చిపడి వున్న గోవు కళేభరంపై ప్రవహింపచేయమని చెప్పి పంపాడు. గౌతముడు శివుని జట తో పరుగుపరుగున వచ్చి శతశృంగంలోని తన పొలంలో పడిఉన్న గోవు అస్థికలపై ప్రవహింప చేశాడు. వెంటనే గోవు బ్రతికింది. అందరు ఆనందించారు. ఆ ప్రవాహం గోవును వరంగా ఇచ్చింది కనుక గోదావరి అని గౌతముడు తెచ్చినది కనుక గౌతమి అని పేరు పొందింది. ఈ గోదావరినది జన్మగాధ వరాహపురాణంలో ఉంది.