ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరల్లో రోజు రోజుకీ పెను మార్పులు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ స్టాక్ మార్కెట్లు అసలే నష్టాల్లో ఉన్నాయి. 10 లక్షల కోట్ల మేర ఇప్పటికే మదుపరుల సంపద ఆవిరైపోయింది. ఈ క్రమంలోనే బంగారం ధరలు కూడా తగ్గుతుండడం కలవరపెడుతోంది. అయితే ఈ ధరలు ఇంకా పడిపోతాయా.. తులం బంగారం ధర రూ.50వేలకు వస్తుందా.. అని వినియోగదారులు సైతం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అది నిజం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
నవంబర్ 6వ తేదీన 10 గ్రాముల బంగారం ధర రూ.78,566 ఉండేది. అదే రోజు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించారు. కట్ చేస్తే నవంబర్ 14న ధర రూ.73,740 కి చేరుకుంది. ఏకంగా 6 శాతం తగ్గింది. రూ.4,826 మేర బంగారం ధర తగ్గింది. అయితే పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధర పెరగాల్సింది పోయి తగ్గుతుండడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బంగారం కొనేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు.
అయితే మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్న ప్రకారం బంగారం ధరలు ఇంకా తగ్గవచ్చని అంటున్నారు. కానీ రూ.50వేల వరకు రాకపోవచ్చని చెబుతున్నారు. రూ.70వేలకు చేరుకునే చాన్స్ ఉందని అంటున్నారు. అయితే రానున్న రోజుల్లో బంగారం ధర ఇంకా పెరిగే చాన్స్ ఉందని, ఇలా తగ్గడం తాత్కాలికమే అని చెబుతున్నారు. మరి భవిష్యత్తులో బంగారం ధర ఎలా ఉంటుందో చూడాలి.