Naivedyam : దేవుడి ఆరాధనలో ప్రధానమైనది నైవేద్య నివేదన.. గుడిలో దేవుడికే కాదు, ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు, వ్రతాలు చేసినప్పుడు, ప్రత్యేక పూజలప్పుడు దేవుడికి నైవేద్యం సమర్పించడం సాధారణం. అలాంటి నైవేద్య నివేదన చేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. దానివల్ల ఉత్తమగతులు పొందే అవకాశాలను కోల్పోతుంటాం. కాబట్టి ఇకపై నైవేద్య నివేదన చేసేప్పుడు ఈ నియమాలను తప్పక పాటించండి.
నైవేద్యం ప్లాస్టిక్, స్టీల్, గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు. నైవేద్య నివేదనానికి బంగారు, వెండి లేదా రాగి పాత్రలను మాత్రమే వాడాలి. వేడిగా ఉన్న పదార్దాలను నైవేద్యంగా పెడితే అది మహాపాపం అవుతుంది. అలా అని చల్లని పదార్దాలను కూడా నైవేద్యానికి పెట్టకూడదు. గోరువెచ్చని పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఎవరైతే నైవేద్య పదార్థాలను తయారు చేస్తారో వాళ్లే నివేదన చేయాలి. అలాకాకుండా వేరొకరి చేత చేయించినట్టయితే నా తరపున వేరొకరు నివేదన చేస్తున్నారు, అపరాధం ఉంటే క్షమించమని అడగాలి.
ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ గృహస్తు మాత్రమే నైవేద్య నివేదన చేయాలి. వేరొకరు పనికి రారు. బయటకొన్న పదార్థాలను, అతిగా పులిసినవి, ఇంట్లో తయారు చేసినవే అయినప్పటికీ, అతిగా పులుపువి, అతి కారంగా ఉన్న పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు. నైవేద్యం పెట్టిన వ్యక్తి తప్పనిసరిగా హారతి ఇవ్వాలి. నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలి. నైవేద్యం పెట్టిన తర్వాత ఒక 5 నిముషాలు అలాగే వదిలేసి మనం పూజగదిలో నుండి వచ్చేయాలి. ఇలా చేస్తే దేవుడి చూపు ఆ ప్రసాదం పైన పడుతుంది.
నైవేద్యం ఎప్పుడూ కూడా చేసింది చేసినట్టుగా పెట్టాలి. కానీ దేవుడి కోసం విడిగా పెడితే అది మంచిది కాదు. ఈ నేపథ్యంలో కొంతమంది ముందుగానే నైవేద్యాలను తయారుచేసి పెట్టుకుంటే, మరికొందరు అప్పటికప్పుడు సిద్ధం చేసి పెడుతుంటారు. అయితే ఈ రెండు విధానాలు కూడా సరైనవికావని శాస్త్రం చెబుతోంది. నైవేద్యం పెట్టే సమయంలో ఆహార పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతా స్త్రోత్రం చదవాలి. ఏ కులస్థులైనా సరే, ఏ దేవీ దేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి, అమ్రుతమస్తు, అమ్రుతోపస్తరణమసి స్వాహా.. అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి.
తర్వాత ఓం ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , ఓమ్ బ్రహ్మణే స్వాహా.. అని కుడిచేత్తో ఆహార పదార్థాల్ని దేవుళ్లకు చూపించాలి. మధ్యే మద్యదే పానీయం సమర్పయామి.. అని.. నైవేద్యే పానీయం సమర్పయామి.. అని నైవేద్యం మీద మళ్ళీ నీటి బిందువుల్ని ప్రోక్షించాలి. నమస్కరోమి అని సాష్టాంగం చేసి లేవాలి. ఇలా దేవుళ్లు, దేవతలకు నైవేద్యాలను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే సరైన పద్ధతిని పాటించినట్లు లెక్క. ఇలా కాకుండా తప్పుగా నైవేద్యం పెడితే అన్నీ అనర్థాలే కలుగుతాయి.. అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.