హిందూ దేవుళ్లు, దేవతల్లో ఒక్కొక్కరినీ ఒక్కో రోజు భక్తులు పూజిస్తారని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం హనుమంతున్ని భక్తులు పూజిస్తారు. కొందరు ఆ రోజున ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. కొందరైతే ఆలయాలకు వెళ్లకున్నా ఇంట్లో ఉండే పూజ చేస్తారు. ఇంకా కొందరు ఆ రోజున ఉపవాసం ఉంటారు. నీచు, మద్యం వంటివి ముట్టరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమకు అనుకూలమైనట్టుగా హనుమంతున్ని పూజిస్తారు. అయితే మంగళవారం రోజున కింద చెప్పిన విధంగా ఎవరైనా హనుమంతున్ని పూజిస్తే దాంతో శుభాలు ఎక్కువగా జరుగుతాయట. అదృష్టం కలసి వస్తుందట. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు పోతాయట. ఇతర ఇబ్బందులు ఏవి ఉన్నా తొలగిపోతాయట. మరి మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందామా.
మంగళవారం రోజున ఆంజనేయస్వామికి పూజ చేసి ఉపవాసం ఉండే దంపతులకు పిల్లలు త్వరగా పుడతారట. ఏవైనా దోషాలు ఉంటే పోతాయట. దుష్ట శక్తుల ప్రభావం పోయి పిల్లలు చక్కగా పుడతారట. అయితే రాత్రి పూట ఉప్పు లేని ఆహారాన్ని తినాలట. మంగళవారం రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమాన్‌ను పూజించాలి. దీంతో శుభం కలుగుతుంది. సమస్యలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామికి మంగళవారం రోజున ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి. దీంతో ఆయన ఆశీస్సులు ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా గ్రహ దోషాలు ఉంటే పోతాయట. జీవితంలో అన్నీ సమస్యలనే ఎదుర్కొంటున్న వారు ఇలా హనుమాన్‌ను పూజిస్తే ఫలితం ఉంటుందట.
ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారు ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి హనుమంతున్ని పూజిస్తే తప్పక ఆరోగ్యం బాగు పడుతుందట. మంగళవారం రోజున ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా చదివితే ఏ సమస్య ఉన్నా ఇట్టే పోతుందట. అన్ని సమస్యలకు హనుమాన్ చాలీసా పఠనం వల్ల పరిష్కారం లభిస్తుందట.