భారత దేశంలో దేవాలయాలకు కొదువు లేదు. అయితే విశిష్టమైన దేవాలయాలను వేళ్ల పై లెక్కబెట్టవచ్చు. ఇటువంటి కోవకు చెందినదే కడప జిల్లా గండిలోని వీరాంజనేయస్వామి దేవాలయం. ఇక్కడ అదృశ్యరూపంలో ఉండే బంగారు తోరణం మహనీయులకు మాత్రమే కనిపిస్తుంది. అంతే కాకుండా ఇక్కడ సజీవమైన హనుమాన్ మూర్తిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి ఒక పాదానికి చిటికెనవేలు ఉండదు. ఆ చిటికెనవేలును చెక్కేందుకు ఎవరు ప్రయత్నించినా స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుంది. అందుకే ఇక్కడి మూర్తిని సజీవ ఆంజనేయ స్వామి మూర్తిగా పేర్కొంటారు. అంజనీ పుత్రుడైన హనుమంతుడిని ఐశ్వర్యకారకుడిగా భావిస్తారు. ఆయన ఉన్న చోట లక్ష్మీ కూడా కొలువై ఉంటుందని హిందువులు అనాదిగా నమ్ముతున్నారు. అందువల్లే ఆయన్ను నిత్యం పూజిస్తారు.
ముఖ్యంగా శ్రావణ శనివారాల్లో ఆయనకు పూజలు చేయడం వల్ల ఇంటిలో ఐశ్వర్యం తాండవిస్తుందని నమ్ముతారు. అందుకు ప్రతీకగా ఆంజనేయ క్షేత్రాల్లో శ్రావణ మాస ఉత్సవాలు బాగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లా గండి క్షేత్రంలో ఉన్న వీరాంజనేయస్వామికి శ్రావణమాసంలో నాలుగు శనివారాలూ ప్రత్యేక ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహిస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తారు. అసలు ఆ స్వామి ఇక్కడ వెలియడానికి ప్రధాన కారణం ఆ శ్రీరాముడే. త్రేతాయుగంలో రాముడి భార్యను రావణాసురుడు అపహరించిన విషయం తెలిసిందే.ఆ సమయంలో సీత కోసం రాముడు చాలా చోట్ల తిరుగుతాడు. అయితే ఆయనకు ఎక్కడా సీత కనిపించదు. ఈ నేపథ్యంలో లక్ష్మణుడితో సహా శ్రీరాముడు ప్రస్తుత గండి క్షేత్రానికి చేరుకొంటాడు. త్రేతాయుగం నాటికే ఆ ప్రాంతం వాయు క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ వాయుదేవుడు తపస్సు చేసుకొంటూ ఉండటం వల్లే ఈ క్షేత్రానికి వాయు క్షేత్రమని పేరు వచ్చినట్లు చెబుతారు.
ఇదిలా ఉండగా గండిక్షేత్రానికి చేరుకొన్న ఆ శ్రీరాముడిని తన ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా వాయుదేవుడు కోరుతాడు. అయితే వాయుదేవుడి అభ్యర్థనను శ్రీరాముడు సున్నితంగా తిరస్కరిస్తాడు. అయితే తాను ప్రస్తుతం సీతాన్వేషణలో ఉన్నానని ఎట్టి పరిస్థితుల్లోనూ సమయాన్ని వృథాపోనివ్వనని శ్రీరాముడు వాయుదేవుడికి చెబుతారు. సీత దొరికిన తర్వాత తప్పకుండా ఇక్కడికి మరాల వచ్చి నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తానని చెబుతాడు. అన్నుకొన్నట్లుగానే సీతను లంకలో రావణుడు ఉంచాడని శ్రీరాముడు తెలుసుకొంటాడు. రామరావణ యుద్ధంలో వాయుదేవుడి తోడ్పాటుతో శ్రీరాముడు రావణుడిని వధిస్తాడు. అటు పై అయోధ్యకు బయలుదేరుతాడు. దీంతో వాయుదేవుడు సీత, రామ, లక్ష్మణులకు స్వాగత ఏర్పాట్లు చేస్తాడు. వారు గండి క్షేత్రానికి వస్తున్న విషయం తెలుసుకొని అక్కడ తన తపోశక్తిని వినియోగించి ప్రకృతిని అందంగా తీర్చిదిద్దుతాడు. ముఖ్యంగా గండి క్షేత్రానికి దగ్గరగా బంగారు తోరణాన్ని నిర్మిస్తాడు.
రెండు కొండలను వేరుచేసే పాపాగ్నీ నది పై నిర్మించిన ఆ బంగారు తోరణం సూర్య రశ్మి సోకి విభిన్న అందాలతో శ్రీరామ చంద్రుడికి స్వాగతం పలుకుతుంది. ఇక్కడి ప్రకృతి అందాలకు శ్రీరామ చంద్రుడు, సీత, లక్ష్మణుడు పరవశించి పోయి ఆతిథ్యం స్వీకరించడానికి ఈ గండి క్షేత్రంలో కొద్ది సేపు ఆగుతారు. ఆ ముచ్చటా ఈ ముచ్చట చెప్పుకొంటూ కాలం గడుపుతారు. ఆ సమయంలో తనకు యుద్ధంలో సహాయం చేసిన హనుమంతుడిని తలుచుకొంటూ శ్రీరామ చంద్రుడు హనుమంతుడి విగ్రహాన్ని అందంగా చెక్కుతాడు. ఇంతలో అయోధ్యకు చేరే సుముహుర్తం దగ్గర పడుతోందని తెలుసుకున్న శ్రీరాముడు ఆ ఆంజనేయుడి విగ్రహాన్ని పూర్తి చేయకుండానే అయోధ్యకు బయలుదేరుతాడు. ఇందుకు ప్రతీకగా ఇక్కడ ఆంజనేయుడి కాలికి చిటికిన వేలు ఉండదు. కాగా వాయుదేవుడు కట్టిన ఈ బంగారు మామిడాకుల తోరణం అదృశ్య రూపంలో శాశ్వతంగా నిలిచి పోయిందని భక్తులు ఇప్పటికీ నమ్ముతారు.
మహనీయులకు జీవిత చరమాంకంలో ఈ తోరణం లభిస్తుందని స్థానిక కథనం. ఇందుకు ఉదాహరణగా 18వ శతాబ్దంలో అప్పటి మద్రాసు రాష్ట్రంలో దత్తమండలాలకు కలెక్టర్ గా ఉన్న సర్ థామస్ మన్రోకు ఈ బంగారు తోరణం కనిపించింది. ఈ విషయాన్ని కడప గెజిట్ లో కూడా చూడవచ్చు. శ్రీరాముడు వాయుదేవుడు ఉన్న గండి క్షేత్రానికి వచ్చింది శ్రావణ మాసంలోనే. అందుకే ఇక్కడ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. చివరి శనివారం వీరాంజనేయుడిని ఒంటెపై పురవీధుల్లో ఊరేగిస్తారు. తిరుపతి నుంచి వచ్చేవారు రాయచోటి మీదుగా ప్రయాణించి వీరాంజనేయుడిని సందర్శించుకోవచ్చు. ఇక కడప జిల్లా చక్రాయపేట మండలంలోని గండి క్షేత్రం ఉంది. జిల్లా కేంద్రం నుంచి పులివెందుల వెళ్లే బస్సులో వేంపల్లే చేరుకొని అక్కడి నుంచి గండి చేరుకోవచ్చు. ఇందుకు నిత్యం ప్రభుత్వ, ప్రైవేటు బస్సులతో పాటు ఆటోలు, జీపులు అందుబాటులో ఉన్నాయి.