ఈ రోజుల్లో పాపం, పుణ్యం అంటే తెలియనిది ఎవరికి చెప్పండి. వాటి గురించి దాదాపుగా ప్రతి ఒక్కరికీ తెలుసు. చిన్న పిల్లలను అడిగినా పాప పుణ్యాలను గురించి చెబుతారు. మంచి చేస్తే పుణ్యం వస్తుందని, చెడు చేస్తే పాపం వస్తుందని ఈ క్రమంలో పుణ్యం సంపాదించుకునే వారు స్వర్గానికి, పాపం ఆర్జించే వారు నరకానికి పోతారని హిందూ పురాణాల్లో ఉంది. త్రేతాయుగం మొదలుకొని ప్రస్తుతం నడుస్తున్న కలియుగం వరకు ప్రతి యుగంలోనూ హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పాప పుణ్యాలపైనే మనిషి జననం, మరణం ఆధార పడి ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఇతర మత సిద్ధాంతాల్లోనూ పాప, పుణ్యాల ప్రస్తావన ఉంది. అయితే ఇప్పుడీ పాప, పుణ్యాల ప్రస్తావన ఎందుకనే కదా మీ సందేహం! అక్కడికే వస్తున్నాం.
మనిషికి మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది. తాను చేసింది, చేస్తుంది, చేయబోయేది మంచో చెడో ఆ మనస్సాక్షి తెలియజేస్తుంది. మంచి చేస్తే ఓకే, కానీ చెడు చేస్తే మాత్రం ఆ మనస్సాక్షి అసలు ఊరుకోదు. ఏదో ఒక విధంగా పశ్చాత్తాప పడేలా చేస్తుంది. ఈ క్రమంలో చెడు చేసే మనుషులకు ఒక్కో సందర్భంలో పాప భీతి కూడా కలుగుతుంది. దీంతో తన పాపాలను పోగొట్టుకోవడానికి దాన ధర్మాలు చేయడం, ఆలయాలను సందర్శించడం, గంగలో మునిగి రావడం వంటి పనులు చేస్తారు. అలా ఆ పనులన్నీ చేస్తే తాము చేసిన చెడు దాని వల్ల వచ్చిన పాపం అంతా పోతుందని వారి నమ్మకం. ఈ క్రమంలో అలాంటి నమ్మకం ఉన్నవారి కోసమే రాజస్థాన్‌లోని ఓ ఆలయం వారు వినూత్న తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఉన్నగౌతమేశ్వర్ మహాదేవ్ పాప్‌మోచన్ తీర్థ శివాలయంలో పండితులు భక్తులకు మహదవకాశం కల్పిస్తున్నారు. అదేమిటంటే పాపభీతితో ఈ ఆలయానికి వచ్చే భక్తులకు వారు కేవలం రూ.11కే పాపముక్తి (పాపం నుంచి విముక్తి కలిగించే) సర్టిఫికెట్‌ను ఇస్తున్నారు. పండితులు తమ కోసం రూ.1 తీసుకుని మిగతా రూ.10ని సర్టిఫికెట్ కోసం కేటాయిస్తారన్నమాట. అయితే ఈ సర్టిఫికెట్‌ను పొందాలంటే ముందుగా భక్తులు అక్కడ ఉన్న ఓ గుండంలో మునగాల్సి ఉంటుంది. అనంతరం రూ.11 చెల్లిస్తే పాపముక్తి సర్టిఫికెట్ ఇస్తారు.
ఈ శివాలయానికి హరిద్వార్ ఆఫ్ ట్రైబల్స్ అనే పేరు కూడా ఉంది. ప్రతి ఏటా మే నెలలో ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. కాగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ ఆలయంలో పాపముక్తి సర్టిఫికెట్‌ను ఇస్తూ వస్తున్నారట. ఈ క్రమంలో ఆలయ అధికారులు అలా పాపముక్తి సర్టిఫికెట్‌ను పొందిన వారి జాబితాను కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్వహిస్తూ వస్తున్నారట. అయితే ఈ ఆలయంలో పాపముక్తి సర్టిఫికెట్ పొందిన వారు మాత్రం తమకు ఎలాంటి ఫలితాలు కలిగాయో ఇప్పటి వరకు చెప్పకపోవడం గమనార్హం. ఏది ఏమైనా ఆలయాల్లో ఇలాంటి సర్టిఫికెట్లు ఇస్తున్నారంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఏమంటారు!