అష్టాదశ శక్తిపీఠాలలో 13 వ శక్తీ పీఠం శ్రీ కామాఖ్యదేవి శక్తిపీఠం. అమ్మవారు యోని రూపంలో దర్శనం ఇస్తారు. అమ్మవారికి సంవత్సరంలో ఒక సారి పీరియడ్స్ వస్తాయి. ఆ మూడు రోజులు అంబుబాచి మేళాని నిర్వహిస్తారు. జూన్ 22 నుంచి 26 వరకు..అమ్మను దర్శించుకొని అమ్మ అనుగ్రహం పొందుతారు. మనదేశంలోని అస్సాంలో గౌహతి నగర పశ్చిమ భాగంలోని నీలాచల కొండల వద్ద , బ్రహ్మపుత్రా నదీ తీరంలో ఈ కామాఖ్య అమ్మవారు వెలసినది. ఈ అమ్మవారిని కామరూపాదేవి అని కూడా పిలుస్తారు. పూర్వం ఈ ఆలయాన్ని రాజవంశులు నిర్మించారు. ఆలయం లోపల ఎంతో పెద్ద గుహ, ఆ గుహలోకి వెళ్లాక ఇంకా లోపలికి వెళ్ళినట్లైతే భూగర్భంలోనికి మెట్లు ఉంటాయి.
గర్భాలయంలోని మూడు అడుగుల చదరంగాను, ఒకటిన్నర అడుగులోతున గుంత ఉన్నది. ఈ గుంత లోపల ఉన్న రాతి నేలపై యోని ముద్ర కనిపిస్తుంది. అదే అమ్మవారి రూపం ఈ రూపం నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడ నుండి వస్తుందో ఎవరికీ తెలియదు. దీనినే తీర్థంగా సేవిస్తారు.
పురాణాల ప్రకారం ఇక్కడ శివుని కోసం సతీదేవి తన సొగసును ఆర్పించిన ఏకాంత ప్రదేశం అని చెప్తుంటారు. శివుడు సతీదేవి శవంతో నృత్యం ఆడినపుడు ఆమె యోని పడిన స్థలం ఇది. ఇక్కడ కామాఖ్య అమ్మవారిని కాళికా అమ్మవారితో పోలుస్తారు.
ఇక్కడ అమ్మవారు సంవత్సరంలో మూడు రోజులు రజస్వల అవుతారు. ఆ సమయంలో శిల నుంచి వచ్చే నీరు ఎర్రగా మారుతుందని చెపుతారు. ఈ మూడు రోజులు పూర్తిగా గుడిని మూసివేస్తారు. నాలుగవ రోజు గుడిని అంతా శుభ్రం చేసి అమ్మవారి పండుగలు జరుపుతారు. దీనినే అంబుజమేళా పండుగ అంటారు. మరొక వారికోత్సవం మానసపూజ, నవరాత్రి సమయంలో దుర్గాపూజను కూడా కామాఖ్య ఆలయంలో వార్షికంగా నిర్వహిస్తుంటారు. ఇది ఐదు రోజుల పండుగ. అనేక వేలమంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.