Theertham : మనం దైవ దర్శనం కొరకు, మానసిక ప్రశాంతత కొరకు అప్పుడప్పుడూ దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. దేవాలయాల్లో దైవ దర్శనం, పూజాది కార్యక్రమాలు ముగిసిన తరువాత మనకు అర్చకులు తీర్థాన్ని ఇస్తారు. చాలా మంది తీర్థాన్ని తీసుకున్న తరువాత దానిని సేవించి ఆ చేతిని తలకు రుద్దుకుంటూ ఉంటారు. అసలు తీర్థాన్ని తీసుకున్న తరువాత చేతిని తలకు తుడుచుకోవచ్చా లేదా..అసలు శాస్త్రం ఏం చెబుతుంది..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దేవాలయంలో మూల విరాట్ ను అభిషేకించిన జలం మాత్రమే తీర్థం అవుతుంది. ఉత్సవ విగ్రహాలకు, అర్చనా మూర్తులకు అభిషేకించిన జలం తీర్థం అవ్వదని పండితులు చెబుతున్నారు. తీర్థం తీసుకునే సమయంలో చూపుడు వేలును బొటన వేలుతో మూయాలి.
అర చేతిలో తీర్థాన్ని అర్చకుడు వేసిన తరువాత దానిని బ్రహ్మ నాభి ద్వారా అనగా చేతికి మధ్యలో ఉండే ఆయుర్ధాయం రేఖ ద్వారా తీర్థాన్ని తీసుకోవాలి. ఈ తీర్థాన్ని కూడా పెదవులకు, దంతాలకు తాకకుండా తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. తీర్థాన్ని నేరుగా నాలుక మీద పడేలా తీసుకోవాలి. తీర్థం పెదవులకు తాకడం వల్ల ఎంగిలి అవుతుంది. అదే దంతాలకు తాకడం వల్ల చర్విత చరన దోషం అవుతుంది. దంతాలకు, పెదవులకు గనుక తీర్థం తాకితే తాకిన వెంటనే చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతేకానీ తీర్థం తీసుకున్న తరువాత చేతికి తలకు తుడుచుకోకూడదు. తలకు తుడుచుకోవడం వల్ల దోషం అవుతుందని పండితులు చెబుతున్నారు.
ఆలయాల్లో చేతులు శుభ్రం చేసుకునేంత తీరిక, సమయం ఉండదు కనుక చేతిని రుమాలుకు తుడుచుకోవాలని పండితులు చెబుతున్నారు. చేతిని నీటితో కడుక్కునే వీలు లేని వారు తీర్థం తీసుకునేటప్పుడే కండువ లేదా రుమాలును నాలుగు మడతలుగా మడిచి రెండు చేతుల మధ్యలో ఉంచి తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థం తీసుకున్న తరువాత చేతిని కండువా లేదా రుమాలుకు తుడుచుకోవాలి. స్త్రీలైతే కొంగుకు తుడుచుకోవాలి. తీర్థం తీసుకున్నతరువాత కండువాకు తుడుచుకోవడం కూడా దోషమే అవుతుంది. కానీ మనం దర్శనం కోసం వరుసలో నిలబడడం వల్ల చేతిని కడుక్కునే వీలు ఉండదు కనుక చేతిని కండువాకు తుడుచుకోవాలి తప్ప తలకు తుడుచుకోకూడదని పండితులు చెబుతున్నారు.