Tenkaya : ఇంట్లో పూజ చేస్తే.. లేదా దేవాలయానికి వెళ్లినప్పుడు ఎవరైనా సరే పూజ అనంతరం కొబ్బరికాయను కొట్టి దైవానికి నైవేద్యంగా సమర్పిస్తారు. మనం చేసే పనుల్లో ఎలాంటి అవరోధాలు ఎదురు కాకుండా ఉండాలన్నా.. మనపై ఉండే దృష్టి పటాపంచలు కావాలన్నా.. కొబ్బరికాయ కొట్టాలి. అలాగే కొబ్బరికాయపై ఉండే మూడు కళ్లు పరమేశ్వరుడికి ప్రతిరూపం. కనుక మనలో ఉండే అహం పోవాలంటే కొబ్బరికాయ కొట్టాలి.
కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే అంతా శుభమే జరుగుతుందని.. కుళ్లిపోతే ఏదో కీడు జరుగుతుందని భావిస్తారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది ? దీనిపై పండితులు ఏమంటున్నారు ? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దైవానికి కొట్టే కొబ్బరికాయను ముందుగా శుభ్రంగా కడగాలి. తరువాత కాయను కొట్టి పగలగానే వెంటనే విడదీసి నీళ్లను పట్టాలి. అనంతరం ఒక్కో ముక్కను దైవానికి ఇరువైపులా పెట్టి నివేదించాలి. ఆ తరువాత కొబ్బరినీళ్లను నైవేద్యంగా పెట్టాలి.
అయితే కొబ్బరికాయను కొట్టినప్పుడు పువ్వు వస్తే శుభం జరుగుతుందని, అది కుళ్లి పోయి ఉంటే కీడు జరుగుతుందని అనుకోకూడదు. ఎందుకంటే కాయలో పువ్వు ఉందా, కుళ్లిపోయిందా, అందులో నీళ్లు ఉన్నాయా.. లేదా.. అనే విషయం మనకు తెలియదు కదా.. కనుక అందులో ఏం వచ్చినా దాన్ని మన జీవితానికి ఆపాదించుకోవాల్సిన పనిలేదు. కాయలో పువ్వు వస్తే ఓకే. లేదా అందులో కుళ్లిపోయి ఉంటే ఆ ముక్కలను పడేసి మళ్లీ చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కుని ఇంకో టెంకాయ కొట్టాలి.
ఇక కొబ్బరికాయ మధ్యలోకి పగిలేలా చూసుకోవాలి. దీంతో మనకు శుభం కలుగుతుందని భావించవచ్చు. వీలైనంత వరకు కాయ సరిగ్గా పగిలేలా చూడాలి. వంకర టింకరగా కాకుండా గుండ్రంగా పగిలేలా కాయను కొడితే శుభం కలుగుతుంది.