నిజానికి పాములు పుట్టలు నిర్మించుకోవండీ. చీమలు నిర్మించిన పుట్టలలో పాములు తలదాచుకుంటాయి. ఏవైనా చిన్న చిన్న జీవాలు గానీ ఆ పుట్టలోనికి వస్తే తమ పొట్టలోకి పంపించవచ్చనే ఉద్దేశ్యం పాములది. ఇకపోతే, మన పురాణాలలో, ఇతిహాసాలలో దోష నివారణ చర్యగా, సర్పములను పూజించడం, కార్తీక మాసములో చవితిని ఆచరించడం, శాప వశమున సర్ప యాగమును చేసి పాములను చంపడం లాంటివి ప్రస్థావించబడినది గానీ, ఎందులోనూ పాలతో, గుడ్లతో, తీపి పదార్థాములను సమర్పించినట్లుగా తెలియజేయలేదు. ఇదంతా మనకు కాలాంతరములో పెద్దల నుంచి వస్తున్న ఆచరణే తప్ప ఆది నుంచి వస్తున్న సత్సంప్రదాయం కాదు.
పాములలో కొన్ని రకాలు గుడ్లను తింటాయి. ఒక్కోసారి తమ గుడ్లను తామే మ్రింగుతాయి. అలా, పాములు గుడ్లను తింటాయని భావించి వాటిని నైవేద్యంగా సమర్పించడం ప్రారంభం అయ్యి వుంటుంది. ఇక పాములు దాహార్థి వలన నీళ్ళు తాగడం చూసి, పాలు కూడా తాగుతాయేమోనని భ్రమించి పట్టడానికి ప్రయత్నించి ఉండవచ్చు! ఒకట్రెండు గుక్కలు పాము త్రాగి ఉండవచ్చును కూడా. అయితే, పాములు సహజంగానే క్షీరద ప్రాణులు కాకపోవడం చేత పాలను అవి ఆరాయించుకోలేవు. ఈ విషయాన్ని తెలుసుకోలేక, పూర్వం భక్తులు ఈ అనాచారానికి తెరతీస్తే, ఇప్పటికీ అది గుడ్డిగా కొనసాగుతూ వస్తోంది. జానపద కథలలో, పురానేతిహాసాలలో, నీతి శాస్త్రాలలో చెప్పబడినవి కామరూపము కలిగిన నాగులు. సినిమాలు, సీరియల్స్ ఈ నమ్మకాలను మరింత పెంచి పోషిస్తున్నాయి.
పుట్టలో పాలు పొయ్యడం సరేసరి, పాములు పట్టేవాళ్ళు కొందరు నాగుల చవితి నాడు ఈ వెర్రి భక్తులతో పాములకు పాలు పట్టిస్తామని నమ్మబలికి తమ స్వార్థం కోసం మూగ జీవాలను బలి చేస్తున్నారు. ఇటువంటి ఉదంతాలు ఇప్పటికీ మన దేశంలో అక్కడక్కడా జరుగుతున్నాయి. ఇంకా పుట్టల దగ్గర టపాసులు కూడా కాలుస్తారు కొన్ని చోట్ల. అది కొంతమేలు అనుకోవచ్చు! చుట్టుపక్కల పాములు గట్రా వుంటే జడుసుకుని ముందే తుర్రు మంటాయి ఈ పిచ్చి జనాల నుంచి. చివరగా… నాగుల చవితి రోజున పుట్టలో పాలు, గ్రుడ్డు, స్వీట్స్ సమర్పించడం అనేది ఆచరించాలా వద్దా అని అంటే… పాముల కోసం అని కాకపోయినా, మరో జీవికి ఆకలి తీరవచ్చును కదా అనుకుని కొనసాగించవచ్చును. ఉంటాను మరి.