త్రిమూర్తులలో ఒకడైన పరమేశ్వరుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తారు. పరమేశ్వరుడికి అభిషేకం అంటే ఎంతో ప్రీతికరం. శివుడికి అభిషేకం చేయడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం అంటే ఎంతో ఇష్టమైన ఆ బోళా శంకరుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
శివలింగానికి బియ్యం పిండితో అభిషేకం చేయడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయడం వల్ల ఉదర సమస్యలు తొలగిపోతాయి. పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. నెయ్యితో అభిషేకం చేయిస్తే మోక్షం లభిస్తుంది. పాలతో అభిషేకం చేయటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. సంతాన ప్రాప్తి కలగాలంటే పెరుగుతో అభిషేకం చేయాలి.
నవధాన్యాలతో శివాభిషేకం చేయటం వల్ల ధనలాభం, భార్య పుత్రలాభం కలుగుతాయి. ఉప్పుతో అభిషేకం చేయడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. మారేడు చెట్టు వేర్లు భస్మంతో అభిషేకం చేయడం వల్ల దరిద్రం అంతమవుతుంది. కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ విధంగా పరమేశ్వరుడికి అభిషేకం నిర్వహించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు.