తండ్రి చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా మారాడు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ‘చిరుత’గా అడుగుపెట్టి.. ఆ తర్వాత నెక్ట్స్ మూవీ ‘మగధీర’తో టాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారాడు. అయితే ఇద్దరు కూడా ఇండస్ట్రీలో దూసుకుపోతుండగా, చిరంజీవి, రామ్ చరణ్‌లకి కలిసి వచ్చిన లక్కీ డేట్ ఒకటి ఉంది. వీరిద్దరికి ఒకే లక్కీ డేట్ ఉండటం విశేషం. మెగాస్టార్ చిరంజీవికి సెప్టెంబర్ 28 కలిసొచ్చిన తేదీ అయితే రాంచరణ్ కు కూడా అదే రోజు అదృష్టం వరించింది.
రాంచరణ్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘చిరుత’ ఇదే రోజు విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలసిందే. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా వైజయంతి మూవీస్ సంస్థలో నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు పూరీ జగన్నాథ్ నేతృత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడం విశేషం. ఇక చిరంజీవి హిందీలో తొలిసారి నటించిన ప్రతిబంధ్ సినిమా సెప్టెంబర్ 28, 1990న విడుదల అయింది. మొదటిసారి బాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టి ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు చిరంజీవి.
రవిరాజ పినిశెట్టి-చిరు కాంబోలో వచ్చిన నాలుగవ చిత్రం ప్రతిబంధ్ కాగా, ఈ చిత్రం తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన అంకుశం సినిమాకు రీమేక్‌గా రూపొందింది. మెగాస్టార్ తన తొలి చిత్రంతోనే హిందీలో సక్సెస్ సాధించారు. నిర్మాతగా అల్లు అరవింద్‌కు తొలి బాలీవుడ్ మూవీ కావడం విశేషం. ఈ సినిమాతో రాంరెడ్డి బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి, అల్లు అరవింద్, రవిరాజా పినిశెట్టి, రామిరెడ్డితో పాటు పలువురు నటీనటులకు టెక్సీషియన్స్‌కు ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఇక సెప్టెంబర్ 28న మెగాస్టార్ గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాడు. మొత్తానికి సెప్టెంబర్ 28 రామ్ చరణ్, చిరంజీవిలకి ప్రత్యేకం కావడం విశేషం.