Sr NTR : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్ గారికి మొత్తం 12 మంది సంతానం. వీరిలో 8 మంది మగ పిల్లలు.. 4 ఆడ పిల్లలు. ఇందులో ముగ్గురు కుమారులైన రామకృష్ణ, సాయికృష్ణ, హరి కృష్ణ స్వర్గస్తులయ్యారు. వీరిలో రామకృష్ణ.. ఎన్టీఆర్ బతికి ఉండగానే కన్నుమూసారు. మిగతా ఇద్దరు తర్వాత స్వర్గస్తులయ్యారు. కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. మొత్తం ఎన్టీఆర్ కుటుంబంలో నలుగురు సంతానం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ సంతానంలో 5 గురు కుమారులు, 3 ముగ్గురు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. నందమూరి కుటుంబంలోనే హరికృష్ణకు కూడా పుత్రశోకం తప్పలేదు. ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో కన్ను మూసాడు.అయితే ఎన్టీఆర్ తన కుమారులకు చివర కృష్ణ వచ్చేలా… రామకృష్ణ, జై కృష్ణ, సాయి కృష్ణ, బాలకృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, జయశంకర్ కృష్ణ అని నామకరణం చేశారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ గురించి చాలామందికి తెలియదు. రామకృష్ణ అంటే ఎన్టీఆర్ కు వల్లమాలిన అభిమానం, ప్రేమ ఉండేది. చెన్నైలోని ఎన్టీఆర్ నివాసంలో రామకృష్ణ అతిథులను ఎంతో గౌరవంగా చూసుకోవడంతో పాటు మర్యాద చేసేవారట.
రామకృష్ణ చిన్న వయసులోనే దాదాపు దేశం లోని పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చారు. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించే రామకృష్ణ కేవలం 17 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో మరణించారు.ఆయన మృతిని ఎన్టీఆర్ అస్సలు తట్టుకోలేకపోయారు. రామకృష్ణ ఓ సారి నానమ్మ తాతయ్యలతో కలిసి నిమ్మకూరు వెళ్ళాడు. అక్కడే రామకృష్ణ మసూచి వ్యాధి బారిన పడగా, ఆ వ్యాధితో బాధపడుతూ కన్నుమూసాడు. రామకృష్ణ చనిపోయిన రోజు ఎన్టీఆర్ ఇరుగుపొరుగు అనే సినిమా షూటింగ్ లో ఉండగా, షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ మేకప్ గదిలోకి వెళ్లి మేకప్ తీసేసిన తర్వాత బోరున ఏడ్చేశాడట. రామకృష్ణని ఎంతో ప్రాణంగా ప్రేమించిన ఎన్టీఆర్ తన కుమారులలో మరొకరికి కూడా రామకృష్ణ అని నామకరణం చేశారు.