Simhasanam Movie : టాలీవుడ్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు స్టార్ హీరో కృష్ణ. ఎన్టీఆర్, ఎన్నార్ లాంటి దిగ్గజాలకు పోటీ ఇస్తూ సూపర్ స్టార్ కృష్ణ సక్సెస్ అయ్యారు. మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు కృష్ణ. ఏడాదికి అత్యధిక సినిమాలు చేసే హీరోగానూ కృష్ణకు పేరుంది. సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో హిట్ సినిమాల్లో సింహాసనం ఒకటని చెప్పవచ్చు. ఈ చిత్రం విడుదలై దాదాపు 38 సంవత్సరాలవుతుంది. ఈ తరం వారికి ఈ సినిమా గురించి అంతగా తెలిసి ఉండకపోవచ్చు కానీ సినిమా యొక్క ప్రత్యేకత తెలిస్తే మిస్ అవకుండా చూస్తారు. అస్సలు ఈ మూవీ ప్రత్యేకత ఏంటో చూద్దాం..
సింహాసనం సినిమాకు దర్శకత్వం, నిర్మాత, ఎడిటర్, హీరో అన్ని సూపర్‌స్టార్ కృష్ణనే కావడం విశేషం. అంతేకాదు.. తెలుగులో మొట్టమొదటి 70 ఎం.ఎం. స్టీరియోఫొనిక్ సౌండ్ సినిమా కూడా ఇదేనట. ఈ సినిమా ప్రత్యేకత గురించి సింపుల్‌గా చెప్పాలంటే 80 సంవత్సరాల కాలంలో ఈ సినిమా కూడా మరో బాహుబలి సినిమా అని చెప్పవచ్చు. ఈ చిత్రం వసూళ్ల విషయంలో కానీ, రికార్డుల విషయంలో కానీ బాహుబలి సినిమాకు ఏమాత్రం తీసిపోదు. సింహాసనం విడుదలైన సమయంలో టికెట్ల కోసం ప్రేక్షకులు 12 కిలోమీటర్ల మేర లైన్‌లో వేచి ఉన్నారంటే ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సృష్టించిందో అర్థం అవుతుంది.
విజయవాడ రాజ్ థియేటర్‌లో ఈ సినిమా విడుదలైన రోజున కిలోమీటర్ల మేర లైన్‌లో జనాలు క్యూ కట్టారట. అందుకే ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఈ విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ రోజుల్లో ఈ సినిమాను నిర్మించడానికి 3.5 కోట్ల రూపాయలు ఖర్చు కాగా.. రూ.5 కోట్లు వసూలు చేసి రికార్డును సృష్టించిందట. ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ చెన్నైలో నిర్వహించగా.. దానికి కృష్ణ అభిమానులు 400 బస్సులతో అక్కడికి చేరుకున్నారు. అంటే 36 ఏళ్ల క్రితమే అద్భుతమైన రికార్డులను సృష్టించిన సినిమా సింహాసనం అని చెప్పవచ్చు.