మీరు దిగేసరికి మీ ఫోను బేటరీ అయిపోతుంది, అంతకన్నా ఈ రోజుల్లో ఇంకేం కాదు. ఏదైనా స్పీకర్ పక్కన ఉండగా సెల్ఫోన్లు మోగితే, గీ..గీ..గీ… అని ఒక ధ్వని రావటం విన్నారా. విమానంలో సెల్ఫోన్లు వాడినప్పుడు కూడా విమాన సిబ్బంది వారి రేడియో ప్రసారణలో ఇలాంటి అంతరాయం పొందే అవకాశం ఉంది, ముఖ్యంగా GSMవి. అయితే ఇలా జరగటం చాలా అరుదు. ఫోన్ సిగ్నల్ అలాంటి అంతరాయం కలిగించటానికి, విమాన సిబ్బంది రేడియో ట్రాన్స్మిటర్లకి మీ ఫోన్ చాలా దగ్గరగా (<10 మీటర్లు) ఉండాలి. ప్రయాణీకులకు, పైలట్లకు మధ్య తగినంత దూరం ఉంటుంది కావున, ఈ ఇబ్బంది రావటం చాలా అరుదు. అరుదు అంటే లక్షల్లో ఒకటంత అరుదు కాదు, ఒక వందలో రెండో మూడో అంత అరుదు.
ఈ అంతరాయం ఈరోజుల్లో అంత ఇబ్బందేమీ కాదు. ఈరోజుల్లో వైఫై, సెల్లులర్ నెట్వర్క్ (In flight WiFi and Cellular Network) ఉండేలా సదుపాయాలు అమెరికా, యూరప్ వంటి దేశాల అంతర్జాతీయ విమానాల్లో వచ్చాయి. మనం ఫోన్ మాట్లాడేటప్పుడు ఒక 3–4 క్షణాలు వినిపించకపోతే ఎంత చిరాకుపడతాం? విమానం టేకాఫ్, లేండింగ్ సమయంలో పైలట్లకు చాలా ముఖ్యమైన సమాచారం, సూచనలు ATC నుండి అందుతుంది. అలాంటప్పుడు ఈ అంతరాయం కలిగితే చాలా ఇబ్బంది, విమాన సిబ్బందికి, ATC వారికి చాలా చిరాకుగా ఉంటుంది.
ఫోన్ ఎరోప్లేన్ మోడ్ లో పెట్టకపోతే, దగ్గర్లో ఉన్న టవర్ కి కనెక్ట్ అవ్వటానికి నిరంతరం వెతుకుతూ ఫోన్ ఎక్కువ శక్తిని వాడుతుంది. దీని వల్ల మీరు దిగేసరికి మీ ఫోన్ బేటరీ ఖర్చైపోతుంది. తెలియని ఊర్లో (తెలిసినదైనా సరే) దిగితే అది మీకే ఇబ్బంది.