టూరిస్ట్ ఫ్యామిలీ.. ఈ సినిమా బాగుంది అని పలువురు చెప్పడంతో, జియో హాట్ స్టార్ లో తమిళంలో subtitles పెట్టుకుని ఈ సినిమాను చూసాను. (తమిళంలో కాకుండా తెలుగులో సినిమాను చూసి వుంటే same ఫీల్ వచ్చేది కాదేమో ననిపించింది!). నేను ఈ సినిమా చూడటానికి పూర్వం, దీనికి సంబంధించిన ట్రైలర్ గానీ, పాటలు గానీ, కనీసం క్లిప్స్ గానీ చూడలేదు. నిజానికి ఈ సినిమా thumbnails చూసినప్పుడు ఆ కలర్ గ్రేడింగ్ గట్రా చూసి ఇదేదో మలయాళం సినిమా అనుకున్నాను కూడా. వాస్తవానికి… టూరిస్ట్ ఫ్యామిలీ అనే టైటిల్ ని చూసి, ఇటీవల పెరిగిన ట్రావెల్ vlogging కల్చర్ ని కాన్సెప్ట్ గా మలిచి ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ థీమ్ తో తీర్చిదిద్దిన కథేమోనని ఊహించుకున్నాను.
అయితే, ఇందులోని కథ మరీ అంత మెలికలు తిరగకుండా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఒకకాలనీలో సాగుతుంది. మొదటి నుంచీ ప్లాట్ కు సంబంధించి చుక్కలు పెట్టుకుంటూ వెళ్లి చివరికి ప్రధానమైన చుక్కలన్నిటికీ సరైన ఎమోషనల్ పే-ఆఫ్ లతో కలుపుతూ, మంచి కుటుంబ కథా చిత్రంగా మలిచారు దర్శకుడు షాన్ రోల్డెన్. శశికుమార్, సిమ్రాన్, మిథున్ జై శంకర్, కమలేష్ జగన్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమాలో అందరూ చాలా చక్కని నటనను కనబర్చారు. ఎలాంగో కుమార్వేల్ ని మొదట నేను గుర్తుపట్టలేకపోయాను. అందరికంటే, చిన్న కొడుకు మురళీగా నటించిన కమలేష్ జగన్ కి ఈ సినిమాలో ఎక్కువ మార్కులు పడతాయని చెప్పవచ్చు!
ఈ సినిమాను చూస్తున్నప్పుడు, ఇందులోని ప్రధాన తారాగణంలో ఒకరైన శశి కుమార్ ఇదివరకు అల్లరి నరేష్ తో కలిసి నటించిన తెలుగు డబ్ సినిమా సంఘర్షణ (తమిళ్: పోరాలి) నాకు గుర్తుకు వచ్చింది. ఆ సినిమా ఛాయలు ఈ సినిమాలో కొంచెం కనపడ్డాయని చెప్పగలను. కాకపోతే, ఆ సినిమా బాగా మాస్ ఎలిమెంట్స్ తో వేగంగా సాగుతుంది. ఈ సినిమా ఫుల్ క్లాసీ కథనంతో వుంటుంది. ఇది దర్శకుడు కావాలని చేసింది కాకపోవచ్చు. హాయిగా రెండున్నర గంటలు కుటుంబంతో కలిసి కూర్చుని చూడదగ్గ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ. యింకా చూడక పోతే ఓ చూపు చూసేయండి.