Cycling : శరీర బరువును తగ్గించుకునేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే అన్ని వ్యాయామాల్లోనూ వాకింగ్ చాలా సులభమైంది. కానీ సైకిల్ తొక్కడం కూడా చాలా సులభమే. దీంతో వాకింగ్ కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. పైగా క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. దీంతో బరువు వేగంగా తగ్గవచ్చు. మరి రోజూ గంట సేపు సైకిల్ తొక్కితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా.
సైకిల్ తొక్కడం వల్ల గంటకు ఏకంగా 400 నుంచి 600 క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. వేగంగా సైకిల్ తొక్కితే ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. దీంతో కొవ్వు వేగంగా కరుగుతుంది. అధిక బరువు త్వరగా తగ్గుతారు. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు రోజూ గంట సేపు సైకిల్ తొక్కితే షుగర్ లెవల్స్ ను గణనీయంగా తగ్గించుకోవచ్చు. సైకిల్ తొక్కడం వల్ల కండరాలకు చక్కని వ్యాయామం అవుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. శక్తి లభిస్తుంది.
డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన సమస్యలతో సతమతం అయ్యేవారు సైకిల్ తొక్కడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. నడుం కింది భాగంలో ఉండే కొవ్వు కరుగుతుంది. చక్కని దేహాకృతి లభిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా. మరి సైకిల్ తొక్కడం ప్రారంభించేయండి ఇక.