నేటి కాలంలో ప్రతి ఇంట్లోనూ డయాబెటిస్ సమస్య ఉంది. మధుమేహం నిర్ధారణ తర్వాత ఆహారం నుంచి జీవనశైలి వరకు ప్రధాన మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా చాలా మంది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి వాకింగ్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ నడవడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రించడం నిజంగా సాధ్యమేనా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. సైన్స్ ఏం చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో నడవడం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఇటీవల ప్రచురించబడిన ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం 5 లక్షలకు పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులపై పరిశోధన చేశారు. తద్వారా సేకరించిన డేటాను విశ్లేషించినప్పుడు.. టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించడానికి నడక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు.
గంటకు 4 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో నడిచే వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. గంటకు 5-6 కిలోమీటర్ల వేగంతో నడవడం వల్ల ప్రమాదాన్ని 24% వరకు తగ్గిస్తుంది. గంటకు 6 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడవడం వల్ల ప్రమాదం దాదాపు 39% తగ్గిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేగంగా నడవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. కండరాలలో గ్లూకోజ్ శోషణను పెంచుతుంది. ఒత్తిడి, వాపును తగ్గిస్తుంది. ఫలితంగా, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి. ఫలితంగా డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ప్రతిరోజూ 20-30 నిమిషాలు వేగంగా నడవడం వల్ల శరీర జీవక్రియ మెరుగుపడి, శరీరంలోని మొత్తం కొవ్వు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే నడక సమయం మాత్రమే కాదు, నడక వేగం కూడా ముఖ్యమేనట. నెమ్మదిగా నడవడం కంటే వేగంగా నడవడం చాలా రెట్లు ఎక్కువ ప్రయోజనకరం. నెమ్మదిగా నడవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వ్యాయామ నిపుణులు కూడా అంటున్నారు. క్రమంగా వేగాన్ని పెంచడం, వేగంగా నడిచే అలవాటును పెంపొందించుకోవడం ద్వారా మాత్రమే డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.