Jogging : మారిన జీవన విధానం కారణంగా మనలో చాలా మంది గుండె జబ్బులు, అధిక బరువు, షుగర్, బీపీ, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే ఏ వ్యాయామం చేసిన చేయకపోయినా ప్రతిరోజూ జాగింగ్ తప్పకుండా చేయాలని నిపుణులు చెబుతున్నారు, యుక్త వయసులో ఉన్నవారు, కూర్చుని ఉద్యోగాలు చేసే వారు, వ్యాపారస్థులు ప్రతిరోజూ జాగింగ్ చయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వారు చెబుతున్నారు. రోజూ 45 నిమిషాల నుండి ఒక గంట పాటు జాగింగ్ చేయడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు.
జాగింగ్ చేడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. అధిక రక్తపోటు సమస్య మన దరి చేరకుండా ఉంటుంది. అలాగే జాగింగ్ చేయడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గి టైప్ 2 డయాబెటిస్ బారిన పడకుండా ఉండవచ్చని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. అలాగే జాగింగ్ చేయడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు వేగంగా కరుగుతుంది. శరీరం ధృడంగా తయారవుతుంది. అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. జాగింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన శ్లేష్మాలు, కఫం తొలగిపోతుంది. అంతేకాకుండా ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఆలోచనా శక్తి పెరుగుతుంది. కాళ్లల్లో కండరాలు ధృడంగా అవుతాయి. జాగింగ్ చేయడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి. మన శరీరం మీద మనకు నియంత్రణ ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. ఈ విధంగా జాగింగ్ చేయడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని జాగింగ్ చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.