Exercise : బరువు తగ్గడానికి, ఫిట్ గా , ఆరోగ్యంగా ఉండడానికి మనలో చాలా మంది రోజూ వ్యాయామం చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో వ్యాయామం మనకు ఎంతగానో సహాయపడుతుంది. వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బీపీ, షుగర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల ఇలా అనేక రకాలుగా మనకు మేలు కలుగుతుంది. అయితే సమయానుకూలతను బట్టి కొందరు ఉదయం పూట వ్యాయామం చేస్తారు మరికొందరు మధ్యాహ్నం, సాయంత్రం పూట వ్యాయామం చేస్తారు.
ఉద్యోగం, వ్యాపారం, ఇంటి పనులు ఇలా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని వారి వారి దినచర్యలకు తగ్గినట్టు ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రం పూట వ్యాయామం చేస్తూ ఉంటారు. అయితే మనలో చాలా మందికి వ్యాయామం ఎప్పుడూ చేయడం మంచిది అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. కనుక వ్యాయామం ఏ సమయంలో చేయడం మంచిది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఉదయం పూట వ్యాయామం చేస్తారు. ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల జీవక్రియ వేగంగా పని చేస్తుంది. క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. ఏకాగ్రత పెరుగుతుంది. రోజంతా స్థిరమైన దినచర్యతో పని చేసుకోవచ్చు.
ఉదయం పూట వ్యాయామం చేయడం మంచిదే అయినప్పటికి ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల కండరాలు వేడెక్కడానికి సమయం ఎక్కువగా పడుతుంది. దీంతో గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నవారికి వ్యాయామం చేయడం కూడా కుదరదు. దీంతో కొందరు మధ్యాహ్నం వ్యాయామం చేస్తారు. మధ్యాహ్నం సమయంలో శరీర ఉష్ణోగ్రత, కండరాల పనితీరు గరిష్ట స్థాయిలో ఉంటుంది. కండరాలు త్వరగా వేడెక్కుతాయి. గాయాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే మధ్యాహ్నం సామూహికంగా, స్నేహితులతో వ్యాయామం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కొందరు మరింత ఉత్సాహంగా వ్యాయామం చేస్తారు.
అయితే మధ్యాహ్నం వ్యాయామం చేసే సమయంలో పని ఒత్తిడి కారణంగా కొందరు సరిగ్గా వ్యాయామం చేయలేకపోతారు. కొందరికి వ్యాయామం చేయడానికి ఎటువంటి ప్రేరణ కలగదు. అలాగే కొందరు సాయంత్రం సమయంలో వ్యాయామం చేస్తారు. సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రాత్రి సమయంలో చక్కగా నిద్ర పడుతుంది. అలాగే సాయంత్రం సమయంలో కండరాల పనితీరు, శరీర ఉష్ణోగ్రత చక్కగా ఉంటుంది. దీంతో మనం మెరుగైన వ్యాయామాన్ని చేయగలుగుతాము. అయితే నిద్రించడానికి ముందు కొందరు తీవ్రమైన వ్యాయామాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల నిద్రకు ఆటంకాలు కలగవచ్చు.
అలాగే రోజంతా పని చేసిన కారణంగా అలసట, ఒత్తిడి కారణంగా కొందరు సాయంత్రం సమయంలో సరిగ్గా వ్యాయామం చేయలేకపోవచ్చు. రోజూ సాయంత్రం పూట వ్యాయామం చేయడం వల్ల సవాలుగా మారవచ్చు. వ్యాయామం ఏ సమయంలో చేసినప్పటికి కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు తప్పకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొందరు ఉదయం పూట ఉత్సాహంగా ఉంటారు మరికొందరు సాయంత్రం పూట ఉత్సాహంగా ఉంటారు. కనుక ఎవరి దినచర్యను బట్టి ఎవరి శరీరతత్వాన్ని బట్టి వారు వ్యాయామం చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.