Categories: Featured

ఈ 6 మొక్క‌ల‌ను ఇంట్లో పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

ప్ర‌స్తుత త‌రుణంలో ఎక్క‌డ చూసినా గాలి కాలుష్యం అనేది పెరిగిపోయింది. ఒక‌ప్పుడు కేవ‌లం న‌గరాల్లో మాత్ర‌మే కాలుష్య‌భ‌రిత‌మైన వాతావ‌ర‌ణం ఉండేది. కానీ ప్ర‌స్తుతం ప‌ట్ట‌ణాల్లోనూ కాలుష్యం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతోంది. దీంతో ప్ర‌జ‌లు అనేక అనారోగ్య స‌మస్య‌ల బారిన ప‌డుతున్నారు. పీల్చేందుకు స్వ‌చ్ఛ‌మైన గాలి కూడా ల‌భించ‌ని ప‌రిస్థితి నెలకొంటోంది. అయితే బయ‌ట ఎలాగూ కాలుష్యంతో నిండిన గాలిని పీలుస్తున్నాం. కానీ ఇంట్లో స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అందుకు గాను కింద తెలిపిన మొక్క‌ల‌ను ఇండ్ల‌లో పెంచుకోవాలి. అవి గాలిలో ఉండే కాలుష్య కార‌కాల‌ను త‌గ్గిస్తాయి. గాలిని శుభ్రం చేసి స్వ‌చ్ఛ‌మైన గాలిని మ‌న‌కు అందిస్తాయి. మ‌రి ఆ మొక్క‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. బోస్ట‌న్ ఫెర్న్ (Boston Fern)

6 plants that clean air in your home

ఈ మొక్క ఇంట్లో గాలిలో ఉండే ఫార్మాల్డిహైడ్ వంటి కాలుష్య కార‌కాల‌ను నిర్మూలిస్తుంది. అలాగే బెంజీన్‌, జైలీన్ వంటి స‌మ్మేళనాల‌ను గాలి నుంచి తొల‌గించి గాలిని శుభ్రంగా మారుస్తుంది. వీటికి వారంలో ఒక‌సారి నీటిని పోస్తే చాలు. దీన్ని ఇంటి లోప‌ల పెంచుకోవ‌చ్చు.

2. స్పైడ‌ర్ ప్లాంట్ (Spider Plant)

ఇవి కూడా గాలిలోని కాలుష్య కార‌కాల‌ను నిర్మూలిస్తాయి. వీటిని ఇండ్ల‌లో పెంచుకోవ‌చ్చు. సంర‌క్ష‌ణ గురించి పెద్దగా ప‌ట్టించుకోవాల్సిన పనిలేదు. కిటికీల్లో ఎండ త‌గిలే చోట పెడితే చాలు. అవే సుల‌భంగా జీవిస్తాయి.

3. వీపింగ్ ఫిగ్ (Weeping Fig)

ఈ మొక్క‌లను సంర‌క్షించాలే గానీ 2 ఫీట్ల నుంచి 10 ఫీట్ల వ‌ర‌కు పెర‌గ‌గ‌ల‌వు. వీటి నిర్వ‌హ‌ణ‌కు కూడా పెద్ద‌గా స‌మ‌యం కేటాయించాల్సిన ప‌నిలేదు. వీటిని ఇంట్లో, ఇంటి బ‌య‌ట కూడా పెంచుకోవ‌చ్చు. కానీ సూర్య ర‌శ్మి త‌గిలేలా ఉంచాలి. ఒక్క‌సారి నీటిని పోశాక నీరు పూర్తిగా త‌డి ఆరిపోయే వ‌ర‌కు వేచి ఉండి అప్పుడు మ‌ళ్లీ నీటిని పోయ‌వ‌చ్చు. అందువ‌ల్ల ఈ మొక్క‌ల‌ను సుల‌భంగా పెంచుకోవ‌చ్చు. ఇక ఇవి కూడా ఇంట్లోని గాలిని శుభ్రం చేసేందుకు స‌హాయ ప‌డతాయి.

4. పీస్ లిల్లీ (Peace Lily)

ఇది కేవ‌లం ఇంట్లోని గాలిని శుభ్రం చేయ‌డం మాత్ర‌మే కాదు, అంద‌మైన పూల‌ను కూడా పూస్తుంది. అవి సువాస‌న‌ను వెద‌జ‌ల్లుతాయి. ఇంట్లో పెట్టుకుంటే ప‌రిస‌రాలు అందంగా క‌నిపిస్తాయి. ఈ మొక్క‌లు కూడా గాలిలో ఉండే కాలుష్య కార‌కాలు, ఆర్గానిక్ సమ్మేళ‌నాల‌ను తొల‌గిస్తాయి. గాలిని శుభ్రం చేస్తాయి. వీటి నిర్వ‌హ‌ణ కూడా చాలా సుల‌భ‌మే. అయితే ఈ మొక్కలు చిన్నారుల‌కు ప్ర‌మాద‌క‌రం. క‌నుక చిన్నారులు ఉన్న ఇండ్ల‌లో జాగ్ర‌త్త‌గా ఉండాలి.

5. ఇంగ్లిష్ ఐవీ (English Ivy)

ఇంట్లోని గాలిలో ఉండే కాలుష్య కార‌కాల‌ను తొల‌గించ‌డంలో ఈ మొక్క కూడా అద్భుతంగా ప‌నిచేస్తుంది. దీన్ని ఇంట్లో అలంక‌ర‌ణ కోసం కూడా పెంచుకోవ‌చ్చు. అయితే సూర్య‌ర‌శ్మి త‌గిలే చోట ఉంచాలి. ఎప్పుడో ఒక‌సారి నీటిని పోసినా చాలు, సుల‌భంగా ఈ మొక్క పెరుగుతుంది. గాలిని శుభ్ర ప‌రుస్తుంది.

6. అలోవెరా (Aloe Vera)

ఈ మొక్క గురించి దాదాపుగా అంద‌రికీ తెలుసు. క‌ల‌బంద మొక్క ఆకుల నుంచి తీసిన గుజ్జును అనేక స‌మ‌స్య‌ల‌కు, ఔష‌ధాల త‌యారీలో ఉపయోగిస్తారు. అయితే ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే గాలిని శుభ్రం చేస్తుంది. గాలిలో ఉండే అనేక స‌మ్మేళ‌నాల‌ను నిర్మూలిస్తుంది. ఇండ్ల‌లో పెంచుకునే మొక్క‌ల్లో ఇది కూడా ఒక‌టి.

Share
Admin

Recent Posts