ఆయుర్వేదం అత్యంత పురాతనమైన వైద్య విధానం. ఎన్నో వ్యాధులకు ఆయుర్వేదం పరిష్కార మార్గాలను చూపుతుంది. భారతీయుల జీవన విధానం ఎన్నో సంవత్సరాల నుంచి ఆయుర్వేదంతో మిళితమై ఉంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదంకు అంతటి ప్రాధాన్యత లభిస్తున్నందుకు భారతీయులు అందరూ గర్వపడాలి. అయితే మనిషికి అనారోగ్య సమస్యలు అనేవి వాత, పిత్త, కఫ దోషాల్లో ఉండే అసమతుల్యతల వల్ల వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అందువల్ల ఆయా దోషాలను ఎప్పుడూ సమతుల్యంగా ఉంచుకోవాలి. దీంతో అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.
వాత దోషం ఉన్నవారికి మలబద్దకం, నిద్రలేమి, వీపు కింది భాగంలో నొప్పి, దగ్గు వంటి సమస్యలు ఉంటాయి. వీరు గోరు వెచ్చని పాలు, వెన్న, తృణ ధాన్యాలు, గోరు వెచ్చని పానీయాలను తమ ఆహారంలో తీసుకోవాలి. అలాగే జీలకర్ర, అల్లం, లవంగాలు వంటి మసాలా దినుసులను కూడా తీసుకోవాలి. రాత్రి నిద్రించే ముందు పాలలో ఆయా మసాలా దినుసులను కలుపుకుని తాగాలి.
* పిత్త దోషం ఉన్నవారికి వేడి, అసిడిటీ సమస్యలు వస్తాయి. త్వరగా కోపం వస్తుంటుంది. గ్యాస్ సమస్య, విశ్రాంతి లేనట్లు భావించడం, దద్దుర్లు, దురదలు వంటి సమస్యలు వస్తాయి. వీరు ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు, చల్లని పాలు, తృణ ధాన్యాలను తీసుకోవాలి. నూనె, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలు, పులియ బెట్టిన ఆహారం (ఇడ్లీలు, దోశెల వంటివి) మానేయాలి. ధ్యానం చేస్తే మంచిది.
* కఫ దోషం ఉన్నవారు లావుగా ఉంటారు. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. స్థూలకాయం, శ్వాసకోశ సమస్యలు, పోషకాహార లోపం, భారీగా అనిపించడం, వాపులు రావడం, ఆందోళన వంటివన్నీ కఫ దోష లక్షణాలు. వీరు శారీరక శ్రమ ఎక్కువగా చేయాలి. గోరు వెచ్చని పానీయాలను తీసుకోవాలి. జీలకర్ర, మెంతులు, పసుపు, నువ్వులు వంటి ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల కఫ దోషం తగ్గుతుంది. ఆయా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365