వేసవికాలంలో సహజంగానే పుచ్చకాయలను చాలా మంది తింటుంటారు. పుచ్చకాయలను తినడం వల్ల వేసవి తాపం తగ్గుతుంది. శరీరం చల్లబడుతుంది. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారు. అలాగే శరీరానికి పోషకాలు కూడా లభిస్తాయి. అయితే పుచ్చకాయలను కొనుగోలు చేసే విషయంలో కొందరు సందేహిస్తుంటారు. చూసేందుకు పుచ్చకాయలు అన్నీ బాగానే కనిపిస్తుంటాయి. కానీ వాటిల్లో ఏది పండింది ? ఏది తియ్యగా ఉంటుంది ? అనే విషయం తెలియక సతమతం అవుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన సూచనలు పాటిస్తే పుచ్చకాయను సులభంగా కొనుగోలు చేయవచ్చు. పుచ్చకాయలను చూడగానే అవి తియ్యగా ఉంటాయా ? పండాయా, లేదా ? అనే విషయాలను సులభంగా పసిగట్టగలుగుతారు. అందుకు కింద తెలిపిన సూచనలు పాటించాల్సి ఉంటుంది.
* పుచ్చ కాయలు నిలువుగా భారీ ఆకృతిలో పెరిగి ఉంటే వాటిని పురుష జాతికి చెందిన కాయలుగా అభివర్ణిస్తారు. సాధారంగా ఈ కాయల్లో నీరు ఎక్కువగా ఉంటుంది.
* పుచ్చకాయలు అడ్డంగా భారీ ఆకృతిలో పెరిగితే వాటిని స్త్రీ జాతికి చెందిన కాయలుగా చెబుతారు. ఇవి చాలా తియ్యగా ఉంటాయి.
* పుచ్చకాయలపై తెలుపు రంగు మచ్చలు ఉంటే కొనుగోలు చేయకండి. ఎందుకంటే అవి రుచి లేకుండా చప్పగా ఉంటాయి.
* పుచ్చకాయలపై ఆరెంజ్ కలర్‌లో మచ్చలు ఉంటే అవి చాలా రుచిగా ఉంటాయి.
* పుచ్చకాయల తొడిమలు గ్రీన్ కలర్‌లో ఉంటే అవి పండలేదని గుర్తించాలి. అవే తొడిమలు ఎండిపోయి ఉంటే కాయలు బాగా పండాయని అర్థం చేసుకోవాలి.
* పుచ్చకాయలపై గరుకైన భాగం చిన్నగా ఉంటే అవి చప్పగా ఉంటాయి. గరుకైన భాగం పెద్దగా ఉంటే అవి తియ్యగా ఉంటాయి.
* ముదురు ఆకుపచ్చ రంగులో మరీ డార్క్ కలర్‌లో కాయలు ఉంటే అవి బాగా పండాయని అర్థం.
* పుచ్చకాయలపైన కాంతివంతమైన భాగం ఉంటే అవి పండలేదని అర్థం చేసుకోవాలి.