కొత్త సంవత్సరం వస్తుందనగానే చాలా మంది జనవరి 1 నుంచి ఏవైనా మంచి అలవాట్లను పాటించాలని అనుకుంటుంటారు. అందులో భాగంగానే 1వ తేదీ నుంచి నిత్యం నిరంతరాయంగా ఆ అలవాట్లను పాటిస్తూ ముందుకు సాగాలని తీర్మానాలు చేసుకుంటుంటారు. అయితే కేవలం కొందరు మాత్రమే వాటిని విజయవంతంగా పాటిస్తుంటారు. కానీ నిజానికి ఆరోగ్యం విషయంలో కచ్చితంగా నియమాలను పాటించాలి. ఈ క్రమంలోనే కొత్త ఏడాది సందర్భంగా ఆ ఏడాదిలో ఆరోగ్యంగా ఉండేందుకు గాను నిత్యం ఈ కింది నియమాలను పాటించేలా తీర్మానాలు చేసుకోండి. ఆ తీర్మానాలను కచ్చితంగా పాటించండి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. జీలకర్ర, తులసి, పుదీనా, అల్లం, వాము, దాల్చిన చెక్క తదితర పదార్థాలతో హెర్బల్ టీ లాంటి డ్రింక్‌ను తయారు చేసుకుని నిత్యం ఉదయాన్నే తాగండి. దీంతో శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు పోతాయి. మీ రోజును ఆ డ్రింక్‌తో ప్రారంభిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. వాటిల్లో ఉండే పోషకాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
2. పైన తెలిపిన డిటాక్స్ డ్రింక్‌ను తాగిన వెంటనే పండ్లను తినండి. పండ్లను ఉదయం పరగడుపున తినడం వల్లే ఎక్కువ లాభాలు కలుగుతాయి. అందువల్ల డిటాక్స్ డ్రింక్ తాగాక కొద్దిగా ఆగి తరువాత పండ్లను తినాలి. దీంతో రోజంతటికీ కావల్సిన పోషకాలు దాదాపుగా అందుతాయి.
3. భిన్న రకాల రంగులకు చెందిన పండ్లు, కూరగాయలను నిత్యం తినేలా ప్లాన్ చేసుకోండి. దీన్ని వల్ల భిన్న రకాల పోషకాలు లభిస్తాయి. పోషకాహార లోపం రాకుండా చూసుకోవచ్చు. వ్యాధులు రాకుండా ఉంటాయి.
4. రసాయనాలు కలిపి తయారు చేసిన కృత్రిమ పదార్థాలు, జంక్ ఫుడ్, ప్యాక్ చేయబడిన ఆహారాలు, ప్రాసెస్ చేయబడిన పదార్థాలను తినకండి. వాటి ద్వారా డయాబెటిస్, అధిక బరువు, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్, హై బీపీ వంటి సమస్యలు వస్తాయి. కనుక కొత్త ఏడాదిలో వీటికి దూరంగా ఉంటామని తీర్మానం చేసుకోండి.
5. రోజులో కనీసం 12 గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి. అంటే ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల మధ్యే ఆహారం తినాలి. రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల మధ్య ఆహారం తినడం మానేయాలి. ఈ విధంగా దినచర్య పాటిస్తూ జీర్ణవ్యవస్థ తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుంది. దీంతో అధిక బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
6. రోజూ చాలా మంది 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తారు. అలా కాకుండా కనీసం 60 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేసేలా ప్లాన్ చేసుకోండి. దీంతో ఇంకా ఎక్కువ ఫలితం పొందవచ్చు.
7. నిత్యం యోగా లేదా శ్వాస వ్యాయామాలు చేయాలి. దీని వల్ల శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా లభిస్తాయి. ఈ క్రమంలో ఊపిరితిత్తులు దృఢంగా మారుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది.
8. నిత్యం వివిధ సందర్భాల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకు యోగా, ధ్యానం చేయవచ్చు. లేదా పచ్చని ప్రకృతిలో కాసేపు గడపవచ్చు. ఇష్టమైన పుస్తకాలు చదవడం, ఆహ్లాదకరమైన సంగీతం వినడం చేయవచ్చు. దీంతో ఒత్తిడి తగ్గుతుంది.
పైన తెలిపిన నియమాలను తీర్మానాలుగా చేసుకుని కొత్త ఏడాది నుంచి వాటిని అనుసరించడం మొదలు పెట్టండి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.