బరువు తగ్గేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రస్తుతం మనకు అనేక రకాల డైట్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మెడిటరేనియన్ డైట్ కూడా ఒకటి. మెడిటరేనియన్ సముద్రానికి సమీపంలో ఉన్న దేశాలైన ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ తదితర దేశాల వాసులు ఎక్కువగా ఈ డైట్‌ను పాటిస్తారు. ఈ డైట్‌లో నూనె కోసం ఆలివ్ ఆయిల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. మెడిటరేనియన్ ప్రాంతాలు కనుక దీనికి మెడిటరేనియన్ డైట్ అని పేరు వచ్చింది.
ఇక మెడిటరేనియన్ డైట్‌లో తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, పాస్తా, బీన్స్, హోల్ గ్రెయిన్ బ్రెడ్‌లను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని నిత్యం తీసుకోవాలి. చేపలు, ఇతర సీఫుడ్, పౌల్ట్రీ, డెయిరీ ఉత్పత్తులను ఒక మోస్తరుగా తీసుకోవచ్చు. వీటిని వారానికి ఒకటి రెండు సార్లు తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్‌ను రోజుకు కొద్దిగా తీసుకోవాలి. రెడ్‌మీట్, స్వీట్లను పూర్తిగా తగ్గించాలి. చాలా స్వల్ప మోతాదులో ఎప్పుడో నెలకు ఒకసారి తీసుకోవాలి. ఇలా మెడిటరేనియన్ డైట్‌ను పాటించాలి.
మెడిటరేనియన్ డైట్‌లో 40 శాతం కార్బొహైడ్రేట్లు, 40 శాతం కొవ్వులు, 20 శాతం ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. నిత్యం ఇదే మోతాదులో పోషకాలు అందేలా ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. 1960ల నుంచి ఈ డైట్‌ను పాటిస్తున్నప్పటికీ 1993లో దీనికి కొన్ని మార్పులు చేశారు. దీంతో ఈ డైట్ పాపులర్ అయింది.
మెడిటరేనియన్ డైట్‌ను పాటించే వారు సహజంగానే బాగా ఆరోగ్యవంతులుగా ఉంటారని పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఆయా దేశాల వారు నిజానికి ఈ డైట్‌ను పాటించడం చాలా తగ్గిపోయింది. కానీ ప్రపంచంలో ఇతర దేశాల వారు ఈ డైట్‌ను పాటించడం మొదలు పెట్టారు.
* మెడిటరేనియన్ డైట్‌లో నిత్యం తీసుకోవాల్సినవి – తృణ ధాన్యాలు, బీన్స్, పప్పులు, నట్స్, సీడ్స్, తాజా కూరగాయలు, పండ్లు, ఆలివ్ ఆయిల్
* వారంలో ఒకటి, రెండు సార్లు తీసుకోవాల్సినవి – చేపలు, ఇతర సీఫుడ్, పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, చికెన్, చీజ్, నెయ్యి, పనీర్
* నెలకు ఒకసారి లేదా చాలా స్వల్ప మొత్తాల్లో తీసుకోవాల్సినవి – రెడ్ మీట్ (మటన్, బీఫ్, పోర్క్ మొదలైనవి), స్వీట్లు
* మెడిటరేనియన్ డైట్‌ను పాటించడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
* శరీర శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి.
* అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
* ఆయుర్దాయం పెరుగుతుంది.
* టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
* అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.