కోడిగుడ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. గుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతుంటారు. కోడిగుడ్లలో ఉండే పోషకాలు మనకు శక్తి, పోషణను అందిస్తాయి. అందుకనే రోజుకు ఒక కోడిగుడ్డును తినాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే కోడిగుడ్లను తినే విషయంలో చాలా మందికి ఉండే అపోహల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్డులో పచ్చనిసొన ఉంటుంది కదా. దాన్ని తినకూడదని, అనారోగ్యకరమని కొందరు భావిస్తారు. కానీ అది నిజం కాదు. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు ఒక గుడ్డును పూర్తిగా తినవచ్చు. పచ్చ సొనలో విటమిన్ డి ఉంటుంది. దాన్ని తినకపోతే ఆ విటమిన్ ను కోల్పోతారు. కనుక పచ్చసొనను నిర్భయంగా తినవచ్చు. కానీ రోజుకు ఒక పచ్చ సొన తినవచ్చు. అంతకు మించి తీసుకోకూడదు.
గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు గుడ్లను తినడం మానేస్తారు. అది మంచిది కాదు. వారు రెండు రోజులకు ఒకసారి ఒక గుడ్డును పచ్చసొనతో సహా పూర్తిగా తినవచ్చు. దీని వల్ల ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. అంతేకానీ గుడ్లను తినడం మానేయరాదు.
పచ్చి కోడిగుడ్లు ఆరోగ్యకరమైనవని కొందరు నమ్ముతుంటారు. అది పూర్తిగా అబద్దం. పచ్చి కోడిగుడ్లలో సాల్మొనెల్లా అనే బాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటిని తీసుకుంటే టైఫాయిడ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక పచ్చికోడిగుడ్లు మంచివి కావు. ఉడకబెట్టి తీసుకోవాలి. కోడిగుడ్లను ఉడకబెట్టి తింటేనే ఎక్కువ పోషకాలు మనకు లభిస్తాయి.
సాధారణ ఫామ్ కోడిగుడ్ల కన్నా నాటు కోళ్ల గుడ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయని, అవే ఆరోగ్యకరమైనవని నమ్ముతుంటారు. కానీ అది నిజం కాదు. సైంటిస్టులు చెబుతున్న ప్రకారం.. రెండు రకాల కోడిగుడ్లలోనూ పోషకాలు సమానంగానే ఉంటాయి. ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ అనే తేడాలు ఉండవు. కాకపోతే నాటుకోళ్లు రకరకాల ఆహారాలను తింటాయి కనుక అవి పెట్టే గుడ్లు బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. అంతేకానీ పోషకాలు మాత్రం రెండు రకాల కోడిగుడ్లలోనూ సమానంగా ఉంటాయి.
కోడిగుడ్లను గర్భిణీలు తినకూడదని అంటుంటారు. అందులోనూ నిజం లేదు. నిజానికి గుడ్లు చక్కని పోషకాహారం. కనుక గర్భిణీలు తప్పక వాటిని తినాలి. కానీ పైన చెప్పినట్లుగా పచ్చివి కాకుండా ఉడకబెట్టుకుని తింటే మేలు. దీంతో అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.
చిన్నారులకు గుడ్లను తినిపించరాదని నమ్ముతుంటారు. ఇందులోనూ నిజం లేదు. ఎందుకంటే 7 నెలల వయస్సు రాగానే పిల్లలకు 2 టీస్పూన్ల గుడ్డును తినిపించడం మొదలు పెట్టవచ్చు. గుడ్లు కేవలం 2 శాతం మంది పిల్లల్లో మాత్రమే అలర్జీని కలిగిస్తాయి. అందరిలో కలిగించవు. కనుక గుడ్లను పిల్లలకు తినిపించవచ్చు.
కోడిగుడ్లను ఫ్రిజ్‌లో పెట్టవద్దని అంటుంటారు. అయితే అది నిజం కాదు. గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. కానీ గడ్డకట్టే ఫ్రీజర్ లో పెట్టరాదు. గుడ్లను ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజుల పాటు ఉంటాయి. అలాగే వాటిపై ఉండే బాక్టీరియా నశిస్తుంది. కనుక గుడ్లను ఫ్రిజ్ లో పెట్టవచ్చు. అనేక అమెరికన్, యూరప్ దేశాల వారు గుడ్లను ఫ్రిజ్‌లలోనే స్టోర్ చేస్తుంటారు.
కోడిగుడ్లను ఉడకబెట్టినా, ఫ్రై లేదా ఆమ్లెట్‌లా వేసుకుని తిన్నా పోషకాలను నష్టపోము. కానీ బేకింగ్ వల్ల గుడ్లలో ఉండే పోషకాలు 55 శాతం వరకు నశిస్తాయి. కనుక బేకింగ్ చేయకుండా గుడ్లను ముందు చెప్పినట్లుగా ఇతర పద్ధతుల్లో తీసుకోవచ్చు. దీంతో పోషకాలను ఎక్కువగా గ్రహిస్తాము.