నోరు ఆరోగ్యంగా ఉండాలన్నా, నోరు, దంతాలు, చిగుళ్ల సమస్యలు రాకుండా ఉండాలన్నా నోటి శుభ్రతను పాటించాలి. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోతే అనేక సమస్యలు వస్తాయి. దంతాలు నొప్పి కలుగుతాయి. దంత క్షయం వస్తుంది. చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. అలాగే నోటి దుర్వాసన వస్తుదంఇ. కనుక రోజూ దంతాలను రెండు సార్లు తోముకోవాలి. అలాగే మౌత్ వాష్ లను కూడా వాడాలి. మౌత్ వాష్‌ల విషయానికి వస్తే మార్కెట్‌లో రసాయనాలతో తయారు చేసే ఎన్నో మౌత్ వాష్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటికి బదులుగా మనం ఇంట్లోనే సహజసిద్ధమైన పదార్థాలతో మౌత్ వాష్‌లను తయారు చేసుకుని ఉపయోగించవచ్చు. దీంతో దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి సమస్యలు ఉండవు. మరి సహజసిద్ధమైన మౌత్ వాష్‌లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. కొబ్బరినూనె సహజసిద్ధమైన మౌత్ వాష్‌గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల నోట్లో ఉండే బాక్టీరియా, ఇతర సూక్ష్మ క్రిములు నశిస్తాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కొద్దిగా కొబ్బరినూనెను తీసుకుని నోట్లో పోసుకుని 10-15 నిమిషాల పాటు బాగా పుక్కిలించాలి. అనంతరం నూనెను ఉమ్మేయాలి. తరువాత నీటితో నోరును శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే నోరు శుభ్రంగా మారుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉండవు.
2. అర గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పును కలిపి ఆ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని బాగా పుక్కిట పట్టాలి. అనంతరం ఆ నీటిని ఉమ్మేసి సాధారణ నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసినా కూడా నోరు శుభ్రంగా మారుతుంది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కృత్రిమ మౌత్ వాష్‌ల కన్నా ఉప్పు నీరు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. దీంతో దంత సమస్యలు ఉండవు. చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
3. అర కప్పు శుభ్రమైన నీటిలో అంతే మోతాదులో కలబంద రసం కలిపి ఆ మిశ్రమంతో పుక్కిలించాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల చిగుళ్ల సమస్యలు ఉండవు. దంతాల మధ్య పేరుకుపోయే పాచి తగ్గుతుంది. నోరు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది.
4. ఒక కప్పు శుభ్రమైన నీటిలో 10 చుక్కల దాల్చిన చెక్క నూనె, 10 చుక్కల లవంగాల నూనె కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి. దాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. తరువాత నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. దంత క్షయం ఉన్నవారికి ఈ మిశ్రమం ఎంతగానో మేలు చేస్తుంది. ఈ మిశ్రమాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని సీసాలో నిల్వ ఉంచుకోవచ్చు. ఎక్కువ రోజులు ఉన్నా పాడుకాదు. ఇది సహజసిద్ధమైన మౌత్ వాష్ లా పనిచేస్తుంది. రోజూ దీన్ని ఉపయోగించవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365