Six Pack Body : ఆరు పలకల కండల దేహం.. అదేనండీ.. సిక్స్ ప్యాక్.. ఇదంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఎంతో మోజు పెరిగింది. సినిమాల్లో హీరోలను చూసి వారి ఫ్యాన్స్.. ఆ మాట కొస్తే ఫిట్‌నెస్ ఔత్సాహికులు చాలా మంది సిక్స్ ప్యాక్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. జిమ్‌లో గంటల తరబడి సాధన చేస్తూ.. కఠినమైన డైట్ నియమాలను పాటిస్తూ.. సిక్స్ ప్యాక్ దేహం కోసం శ్రమిస్తున్నారు. సిక్స్ ప్యాక్ తెప్పించుకోవడం ఎంత కష్టమైన పనో.. దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం.
సిక్స్ ప్యాక్ బాడీ ఒకసారి వచ్చాక.. ఆగిపోకూడదు. నిత్యం మళ్లీ జిమ్ లో సాధన చేస్తూనే ఉండాలి. డైట్ పాటిస్తూనే ఉండాలి. అలా చేస్తేనే సిక్స్ ప్యాక్ బాడీ అలా కొనసాగుతుంది. లేదంటే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ఇక సిక్స్ ప్యాక్ బాడీలోనూ పలు రకాలు ఉన్నాయి. అవేమిటంటే..
ఛాతికింద.. పొట్ట మీద అటు 3, ఇటు మూడు యాబ్స్.. లేదా పలకలు ఉంటే.. దాన్ని సిక్స్ ప్యాక్ అంటారు. అదే అటు 4, ఇటు 4 యాబ్స్ ఉంటే.. దాన్ని 8 ప్యాక్ అంటారు. ఇక అటు 5, ఇటు 5 ప్యాక్స్ ఉంటే.. దాన్ని 10 ప్యాక్ అంటారు.
సిక్స్ ప్యాక్‌లోనే రెండో రకం ఉంటుంది. మొదటి రకంలో అటు 3, ఇటు 3 ప్యాక్స్ మధ్య ఖాళీ ఉండదు. కలసిపోయినట్లు ఉంటాయి. ఇక రెండో రకంలో అటు 3, ఇటు 3 ప్యాక్స్ మధ్య ఖాళీ ఉంటుంది. అందువల్ల దీన్ని స్ల్పిట్ సిక్స్ ప్యాక్ అంటారు. ఇక ప్యాక్‌లు ఎన్ని ఉన్నా అవి అటు, ఇటు సమానంగా ఒకే లైన్‌లో లేకుండా ఒక వైపు ఎత్తులో మరో వైపు దిగువకు ప్యాక్స్ ఉంటే.. ఆ ప్యాక్‌ను అసిమ్మెట్రిక్ ప్యాక్ అంటారు. ఇలా సిక్స్ ప్యాక్‌లను వర్ణిస్తారు.
అయితే ప్రతి మనిషికి వాస్తవానికి పొట్ట మీద ఏదో ఒక ప్యాక్ ఉంటుంది. కానీ కొవ్వు కప్పివేయబడి ఉంటుంది. సాధన చేస్తే ఆ కొవ్వు పోయి ప్యాక్స్ బయటకు వస్తాయి. అవి పైన చెప్పిన విధంగా ఏర్పడుతాయి. దీంతో సిక్స్ ప్యాక్, 8 ప్యాక్ లేదా 10 ప్యాక్స్ వస్తాయి. అప్పుడు సిక్స్ ప్యాక్ బాడీ అని పిలుస్తారు.