Bendakaya Pulusu : బరువు తగ్గడానికి ఉపయోగపడే కూరగాయలలో బెండకాయ ఒకటి. బెండకాయను తరచూ మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బెండకాయ జిగురుగా ఉంటుంది అన్న మాటే కానీ బెండకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, రక్త హీనతను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బెండకాయ ఎంతో ఉపయోగపడుతుంది.

మనం పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా చేసే శక్తి కూడా బెండకాయకు ఉంది. బెండకాయలతో మనం ఎక్కువగా వేపుడు కూరలను తయారు చేస్తూ ఉంటాం. బెండకాయతో పులుసు కూరను కూడా తయారు చేస్తూ ఉంటారు. బెండకాయ పులుసు చాలా రుచిగా ఉంటుందని మనందరికీతెలుసు. కొందరికి బెండకాయ పులుసును రుచిగా తయారు చేసుకోవడం రాదు. ఎంతో రుచిగా బెండకాయ పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
బెండకాయలు – 300 గ్రా., చిన్నగా తరిగిన టమాటాలు – 2 (పెద్దవి), నానబెట్టిన చింత పండు – 15 గ్రా., కారం – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – రుచికి తగినంత, నూనె -రెండు టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – ఒకటి, తరిగిన పచ్చి మిర్చి – 3, కరివేపాకు – ఒక రెబ్బ, ఎండు మిర్చి – 2, సన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఎండు కొబ్బరి – ఒక టేబుల్ స్పూన్.
బెండకాయ పులుసు తయారీ విధానం..
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి పొడుగ్గా కట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో తరిగిన టమాట ముక్కలను, ఉప్పు, కారాన్ని వేసి కలిపి చేత్తో టమాట ముక్కలను మెత్తగా చేసి చింతపండును గుజ్జును వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొద్దిగా కొత్తిమీరను వేసి వేయించుకోవాలి.
ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వేయించాలి. తరువాత బెండకాయ ముక్కలను, పసుపును వేసి కలిపి మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న టమాట గుజ్జును, తగినన్ని నీళ్లను పోసి కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మూత తీసి ధనియాల పొడి, ఎండు కొబ్బరిని వేసి కలిపి 3 నిమిషాల పాటు ఉడికించి.. చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసు తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న బెండకాయ పులుసును అన్నం, రాగి సంగటి వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.