Castor Oil Tree : ఆయుర్వేదంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఉపయోగించే.. అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో ఆముదం ఒకటి. ఇది మనందరికీ తెలిసిందే. ఆముదం చెట్టు ఆకులు, కాయలు, గింజలు, ఆముదం నూనె మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పూర్వ కాలంలో ఆముదం నూనెను ఎక్కువగా ఉపయోగించే వారు. కానీ ప్రస్తుత కాలంలో ఆముదం నూనెను ఉపయోగించే వారు చాలా తక్కువగా ఉన్నారు. ఆముదం నూనెలో ప్రోటీన్స్, విటమిన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఆముదం చెట్టు భాగాలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగస్ లక్షణాలను అధికంగా కలిగి ఉంటాయి. మనకు వచ్చే సమస్త వాత వ్యాధులను నయం చేయడంలో ఆముదం ఎంతో ఉపయోగపడుతుంది.
ఆముదంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఆకులు చిన్నగా ఉండే ఆముదాన్ని చిట్టి ఆముదం అని, పెద్దగా ఉంటే పెద్ద ఆముదం అని, పువ్వులు ఎర్రగా ఉంటే ఎర్ర ఆముదం అని, పువ్వులు తెల్లగా ఉంటే తెల్ల ఆముదం అని పిలుస్తూ ఉంటారు. చిట్టి ఆముదాన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. జుట్టు పెరుగుదలలో ఆముదం నూనె ఎంతో సహాయపడుతుంది. ఆముదం నూనెను వాడడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకు పోయిన వ్యర్థాలను తొలగించే శక్తి ఆముదం ఆకులకు ఉంది.
కామెర్లను , కుష్టు వ్యాధిని, చెవి పోటును తగ్గించడంలో ఆముదం ఆకుల రసాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కడుపులో ఉండే నులి పురుగులను నశింపజేయడంలో ఆముదం ఆకుల రసం ఎంతో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఆముదం ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆముదం ఆకులకు నువ్వుల నూనెను రాసి వేడి చేసి నొప్పులు ఉన్న చోట కట్టడం వల్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి.
ఆముదం చెట్టు ఆకులను నీళ్లలో అద్ది తలపై పెట్టుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. కడుపు నొప్పి, వికారం, వాంతులను, మొలలను తగ్గించే గుణం ఆముదం చెట్టు ఆకులకు ఉంటుంది. ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరి గాయాలపై ఉంచడం వల్ల గాయాలు త్వరగా తగ్గుతాయి. అజీర్తిని, మలబద్దకాన్ని తగ్గించడంలో ఆముదం నూనె దోహదపడుతుంది. ఆముదం నూనెను చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా, నల్లగా మారకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.