Chilli Bread : బయట మనకు రెస్టారెంట్లలో చిల్లీ చికెన్, చిల్లీ ప్రాన్స్, చిల్లీ ఫిష్.. ఇలా అనేక వంటకాలు లభిస్తుంటాయి. ఇవన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే మనం బ్రెడ్‌తోనూ ఇలా చిల్లీ వంటకాన్ని చేసుకోవచ్చు. అంటే చిల్లీ బ్రెడ్ అన్నమాట. బ్రెడ్ అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. దీన్ని తరచూ తింటూనే ఉంటారు. అయితే బ్రెడ్ స్లైస్లని ఉపయోగించి ఎంతో రుచికరమైన చిల్లీ బ్రెడ్‌ను కూడా చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిల్లీ బ్రెడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైస్‌లు – 4, ఉల్లికాడలు, చిల్లీ పేస్ట్, టమాటా చిల్లీ సాస్ – ఒక టేబుల్ స్పూన్ చొప్పున, నూనె – 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు (పెద్ద ముక్కలు) – అర కప్పు, క్యాప్సికమ్ (పెద్ద ముక్కలు) – పావు కప్పు, సోయాసాస్, టమాటా సాస్, చిల్లీ సాస్, చిల్లీ పేస్ట్ – అర టీస్పూన్ చొప్పున, వెనిగర్ లేదా నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, మిరియాల పొడి – ఒక టీస్పూన్.
![Chilli Bread : చిల్లీ బ్రెడ్‌ను ఎప్పుడైనా తిన్నారా.. భలే టేస్టీగా ఉంటుంది.. తయారీ ఇలా..! Chilli Bread recipe in telugu very tasty make in this way](https://ayurvedam365-com.in9.cdn-alpha.com//opt/bitnami/wordpress/wp-content/uploads/2022/12/chilli-bread.jpg)
చిల్లీ బ్రెడ్‌ను తయారు చేసే విధానం..
బ్రెడ్ స్లైస్‌లను చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక బ్రెడ్ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి విడిగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తరువాత అదే పాన్‌లో కాస్తంత నూనె వేసి వేడయ్యాక వెల్లుల్లి తరుగు వేసి బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి. తరువాత ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు చల్లి బాగా వేయించాలి. అందులో సోయా, టమాటా, చిల్లీ సాస్‌లు, చిల్లీ పేస్ట్, మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి రెండు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరువాత బ్రెడ్ ముక్కలు వేసి మరో రెండు నిమిషాల పాటు పెద్ద మంట మీద వేయించాలి. ఇలా వేయించిన బ్రెడ్ ముక్కలపై ఉల్లికాడలను చల్లితే.. రుచికరమైన చిల్లీ బ్రెడ్ వేడి వేడిగా రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. అందరూ ఇష్టపడతారు.