Crispy Aloo Puri : మనం ఉదయం పూట అల్పాహారంగా తీసుకునే వాటిల్లో పూరీ కూడా ఒకటి. పూరీని చాలా మంది ఇష్టంగా తింటారు. చట్నీ, సాంబార్, పూరీ కూర వంటి వాటితో తింటే ఈ పూరీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అయితే తరుచూ ఒకేరకం పూరీలు కాకుండా వీటిని మనం మరింత రుచిగా, క్రిస్పీగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా తయారు చేసే ఆలూ పూరీలు కూడా చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. ఈ ఆలూ పూరీలను ఒక్కటి ఎక్కువగానే తింటారని చెప్పవచ్చు. రుచిగా, క్రిస్పీగా, కలర్ ఫుల్ గా ఆలూఐ పూరీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంప – 1 ( మధ్యస్థంగా ఉన్నది), గోధుమపిండి – ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 6, అల్లం – అర అంగుళం, ఉప్పు – తగినంత, పచ్చిమిర్చి – 2, వాము – అర టీ స్పూన్, పంచదార – అర టీ స్పూన్, రవ్వ – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – ఒక టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, చిల్లీ ప్లేక్స్ – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్.
ఆలూ పూరీ తయారీ విధానం..
ముందుగా ఉడికించిన బంగాళాదుంపను ముక్కలుగా చేసి జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పచ్చిమిర్చి, వాము, పంచదార, అల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో గోధుమపిండి, రవ్వ, కొత్తిమీర, నూనె, చిల్లీ ప్లేక్స్, పసుపు వేసి కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంటే నీటిని చల్లి కలుపుకోవాలి. పిండి మెత్తగా ఉంటే మరికొద్దిగా పిండిని వేసి కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తరువాత పైన మరో 2 టీ స్పూన్ల నూనె వేసి కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. పిండి చక్కగా నానిన తరువాతమరోసారి అంతా కలిసేలా కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ నూనె లేదా పొడి పిండి చల్లుకుంటూ పూరీలా వత్తుకోవాలి.
లేదంటే పూరీ మెషిన్ తో పూరీలా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పూరీని వేసి నూనెలోకి గంటెతో వత్తుకోవాలి. పూరీ పొంగి పైకి వచ్చిన తరువాత రెండు వైపులా తిప్పుతూ చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ పూరీ తయారవుతుంది. దీనిని చట్నీతో తిన్నా లేదా పూరీ కూరతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పూరీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.