Crispy Fish Fry : చేపలు.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. చేపల్లో ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయి. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. చేపలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం.వాటిలో చేపల ఫ్రై కూడా ఒకటి. చేపల ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ చేపల ఫ్రైను మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా తేలికగా తయారు చేసుకునేలా చేపల ఫ్రైను క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చేపలు – అరకిలో, కారం – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్.
చేపల ఫ్రై తయారీ విధానం..
ముందుగా చేపలను శుభ్రంగా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత ఒక ప్లేట్ లో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని తీసుకుని బాగా కలపాలి. తరువాత నూనె వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు బాగా పట్టించాలి. తరువాత వీటిపై మూత పెట్టి అర గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. వీటిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించాలి. తరువాత మరో వైపుకు తిప్పుకుని మూత పెట్టాలి. వీటిని మరో నిమిషం పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చేపల ఫ్రై తయారవుతుంది. దీనిని నేరుగా లేదా సైడ్ డిష్ గా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ చేపల ఫ్రైను లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.