Kiwi Fruit Juice : మనం ఆహారంగా తీసుకునే వివిధ రకాల పండ్లల్లో కివీ పండు కూడా ఒకటి. ఇది మనందరికి తెలిసిందే. ఈ పండులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, శరీరంలో మలినాలు తొలగించడంలో ఇలా అనేక రకాలుగా కివీ పండ్లు మనకు సహాయపడతాయి. ఈ పండ్లను నేరుగా తినడంతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే జ్యూస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. వేసవి కాలంలో దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది. కివీపండ్లతో చల్ల చల్లగా రుచిగా జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కివీ ఫ్రూట్ జ్యూస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కివీ పండు – 1, పంచదార – ఒక టేబుల్ స్పూన్, కాచిచల్లార్చిన పాలు – 100 ఎమ్ ఎల్, ఐస్ క్యూబ్స్ – 6.
కివీ ఫ్రూట్ జ్యూస్ తయారీ విధానం..
ముందుగా కివీ పండుపై ఉండే చెక్కును తీసేసి ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కలను ఒక జార్ లోకి తీసుకుని ఇందులో పంచదార, పాలు వేసి మెత్తగా జ్యూస్ లాగా చేసుకోవాలి. తరువాత ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను గ్లాస్ లో పోసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చల్ల చల్లగా ఎంతో రుచిగా ఉండే కివీ ఫ్రూట్ జ్యూస్ తయారవుతుంది. దీనిని తాగడం వల్ల వేసవి నుండి ఉపశమనం లభించడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.