Chicken Pulao : చికెన్‌తో రెగ్యులర్ గా కూర లేదా ఫ్రై చేసుకుని తింటే ఏం బాగుంటుంది చెప్పండి. మనిషన్నాక ఆ మాత్రం కళాపోషణ ఉండాలి. చికెన్ తో కూర లేదా ఫ్రై ఎవరైనా చేసుకుని తింటారు. కానీ దాంతో పులావ్ చేసుకుని మీరు ఎప్పుడైనా తిన్నారా ? అవును.. చికెన్ పులావ్ ను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్ దాకా వెళ్లాల్సిన పనిలేదు. పదార్థాలు, కొద్దిగా శ్రమ ఉంటే చాలు.. వేడి వేడి చికెన్ పులావ్ తయారవుతుంది. మరి దాని తయారీకి ఏమేం పదార్థాలు అవసరమో, దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా.
చికెన్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతి బియ్యం – 2 కప్పులు, చికెన్ ముక్కలు – అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్టు – 2 టీ స్పూన్లు, ఉల్లిముక్క – 1 (పెద్దది), యాలకులు – 3, లవంగాలు – 3, పులావు ఆకు – 3, స్టార్ అనిస్ – 2, దాల్చిన చెక్క – 1, పచ్చి మిరపకాయలు – 3, గరం మసాలా పొడి – 1 టీస్పూను, కారం – 1 టీస్పూను, పసుపు – 1 టీ స్పూను, పెరుగు – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – తగినంత.
చికెన్ పులావ్ తయారీ విధానం..
ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. అనంతరం వాటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. అందులో కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు, 1 టీస్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీంతో చికెన్ మారినేట్ అవుతుంది. పాన్ తీసుకుని అందులో నూనె వేసి, నూనె వేడెక్కాక పులావ్ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ అనిస్ వేసి బాగా వేయించాలి. అనంతరం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను నిలువుగా కోసి ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయ్యాక మారినేట్ చేయబడిన చికెన్‌ను వేసి బాగా కలిపి వండాలి.
అందులో 2 కప్పుల పెరుగు వేసి బాగా కలపాలి. చికెన్ ముక్కలు సగం ఉడికే వరకు అలా ఉడికించాలి. తరువాత కడిగిన బియ్యం వేసి కలపాలి. బియ్యం ఉడికేందుకు 4 కప్పుల నీరు పోయాలి. అనంతరం అందులో చిటికెడు పసుపు, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. అన్నం ఉడికాక దించేముందు ఒకసారి గరిటెతో కలియబెట్టాలి. అంతే.. ఘుమ ఘుమలాడే వేడి వేడి చికెన్ పులావ్ తయారవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా మిర్చి కా సాలన్ రైతా, పెరుగు రైతాతోనూ కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.