Kakarakaya Karam Podi : మనం ఆహారంగా తీసుకునే కూరగాయలలో కాకరకాయలు కూడా ఒకటి. చేదుగా ఉన్న కారణంగా వీటిని చాలా మంది ఇష్టపడరు. కానీ ఇతర కూరగాయల లాగా కాకరకాయలు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ కాకరకాయలలో ఉంటాయి. శరీరంలో కొవ్వు స్థాయిలను నియంత్రించడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, బరువు తగ్గడంలో కాకరకాయలు ఎంతో ఉపయోగపడతాయి. కాకర కాయలతో మనం కూరలను, వేపుళ్లను తయారు చేస్తూ ఉంటాం. కాకరకాయలతో కారం పొడిని కూడా తయారు చేస్తూ ఉంటారు. కాకరకాయతో చేసే కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో మొదటి ముద్దలో ఈ పొడిని వేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కాకరకాయ కారం పొడిని మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకర కాయలు – పావు కిలో, ఎండు మిరపకాయలు – 15 నుండి 20, చింతపండు – కొద్దిగా, శనగపప్పు – రెండు టీ స్పూన్స్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ధనియాలు – రెండు టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, నువ్వులు – రెండు టీ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 10, కరివేపాకు – రెండు రెబ్బలు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
కాకరకాయ కారం పొడి తయారీ విధానం..
ముందుగా కాకర కాయల పై ఉండే చెక్కును తీసి శుభ్రంగా కడిగి సన్నగా గుండ్రంగా ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో డీప్ ఫ్రై కు సరిపడా నూనెను పోసి నూనె వేడయ్యాక తరిగిన కాకర కాయ ముక్కలను వేసి కలుపుతూ కాకరకాయ ముక్కలు కరకరలాడే వరకు వేయించి టిష్యూ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో శనగ పప్పు, మినప పప్పు వేసి చిన్న మంటపై వేయించాలి. ఇవి వేగిన తరువాత ధనియాలను, ఎండు మిరపకాయలను వేసి వేయించాలి.
ఇప్పుడు నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించి చల్లగా అయ్యే వరకు ఉంచి జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇందులోనే ముందుగా వేయించిన కాకర కాయలను, రుచికి తగినంత ఉప్పును వేసి మరలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారం పొడి తయారవుతుంది. దీనిని తడి లేని గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యిని, కాకరకాయ పొడిని వేసుకుని కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.