కొన్ని సార్లు మన ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఏం వండాలో దిక్కు తెలీదు. అలాంటి సమయంలోనే ఎంతో తొందరగా, రుచికరంగా మజ్జిగ చారు ను తయారుచేసుకుని తినవచ్చు.మరి ఈ మజ్జిగ చారు ను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
ఒక లీటర్ మజ్జిగ, పచ్చిమిర్చి 10, ఉల్లిపాయ ఒకటి, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, ఉప్పు, పసుపు, పప్పుల పొడి రెండు టేబుల్ స్పూన్లు, నూనె రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
ముందుగా ఉల్లిపాయలను, పచ్చిమిర్చినీ పొడవాటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక గిన్నెను ఉంచి కొద్దిగా నూనె వేయాలి. నూనె బాగా వేడి అయిన తరువాత ఆవాలు వేయాలి. ఆవాలు చిటపట అనగానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి చిటికెడు పసుపు, ఉప్పు వేసి పసుపు వాసన రాకుండా రెండు నిమిషాలు వేడి చేయాలి. రెండు నిమిషాల తర్వాత ఈ మిశ్రమంలోకి మజ్జిగ వేయాలి. మజ్జిగను రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పప్పుల పొడి వేసి స్టవ్ సిమ్ లో పెట్టి పప్పుల పొడి ఉండలు లేకుండా కలపాలి. దీనిలోకి కొత్తిమిర తురుము వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మజ్జిగ చారు తయారైనట్లే.