Kajjikayalu : మనం సాంప్రదాయ బద్దంగా తయారు చేసే తీపి వంటకాలలో కజ్జికాయలు కూడా ఒకటి. వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కజ్జికాయలను బెల్లం, చక్కెర, పుట్నాల పప్పు, పల్లీలు, ఎండు కొబ్బరిని ఉపయోగించి తయారు చేస్తూ ఉంటారు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ కొందరు ఎంత ప్రయత్నించినా వీటిని కరకరలాడుతూ ఉండేలా తయారు చేసుకోలేరు. రుచిగా, కరకరలాడుతూ ఉండేలా కజ్జికాయలను మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. బెల్లాన్ని ఉపయోగించి కరకరలాడే కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
![Kajjikayalu : కజ్జికాయలను ఎంతో రుచిగా ఉండేలా ఇలా తయారు చేసుకోవచ్చు..! make Kajjikayalu in this way for better taste](https://ayurvedam365-com.in9.cdn-alpha.com//opt/bitnami/wordpress/wp-content/uploads/2022/05/kajjikayalu.jpg)
బెల్లం కజ్జికాయల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – 2 కప్పులు, బెల్లం తురుము – 2 కప్పులు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – తగినన్ని, పుట్నాలు – 2 కప్పులు, ఎండు కొబ్బరి తురుము – ముప్పావు కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
బెల్లం కజ్జికాయల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని, వేడి చేసిన నెయ్యిని వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కజ్జికాయలు కరకరలాడుతాయి. ఇప్పుడు తగినన్ని నీళ్లను పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత చేతిలోకి కొద్దిగా నూనెను తీసుకుని ముద్దగా చేసుకున్న మైదా పిండిని మరోసారి కలిపి మూత పెట్టి అర గంట పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక జార్ లో పుట్నాల పప్పును వేసి మెత్తని పొడిలా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్ లో బెల్లం తురుమును వేసి మిక్సీ పట్టి పొడిగా చేసుకున్న పుట్నాల పప్పు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఇందులోనే ఎండు కొబ్బరి తురుము, యాలకుల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
తరువాత ముందుగా ముద్దగా కలుపుకున్న మైదా పిండిని తీసుకుని మరోసారి అంతా కలిపి కావల్సిన పరిమాణంలో ముద్దల్లా చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా చేసుకున్న మైదా పిండి ముద్దను తీసుకుని పొడి పిండిని వేసుకుంటూ చపాతీలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీ మధ్యలో 2 లేదా 3 టీ స్పూన్ల బెల్లం, పుట్నాల పప్పు మిశ్రమాన్ని ఉంచి చపాతీ అంచుల చుట్టూ నీటిని రాసి మధ్యలోకి మలిచి అంచులను వత్తుకోవాలి. ఇలా చేసిన తరువాత కత్తితో అంచులను సమానంగా చేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ చేసుకున్న తరువాత నూనెలో వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యేలా కాల్చుకుని టిష్యూ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే బెల్లం కజ్జికాయలు తయారవుతాయి. వీటి తయారీలో మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా ఉపయోగించవచ్చు. మనకు మార్కెట్ లో కజ్జికాయలను తయారు చేసే అచ్చులు కూడా లభిస్తూ ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల చాలా సులువుగా కజ్జికాయలను తయారు చేసుకోవచ్చు.