అమ్మానాన్న ఓ కొడుకు, ఓ కూతరు.. మొత్తంగా నలుగురున్న ఓ చిన్న ఫ్యామిలీ. నాన్న ఎప్పుడూ ఆర్మీలో ఉంటారు. ఎప్పుడో సెలవు దొరికినప్పుడు గానీ ఇంటికి రాడు. అమ్మ గృహిణి. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటుంది. తన కెరీర్‌ను కూడా వదిలేసి పిల్లల కోసమే తన జీవితం అంకితం చేసింది. ఈ క్రమంలో పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారు అయ్యారు. అయితే ఒక రోజు కొడుకు తన తల్లితో గొడవ పడి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం ఎప్పుడో సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు తండ్రి అతనితో అంటాడు…
తండ్రి: మీ అమ్మతో ఎందుకు గొడవ పడ్డావ్..?
కొడుకు: నాకు అమ్మ చేసిన ఫుడ్ నచ్చలేదు. అందుకే గొడవ పడ్డా.
తండ్రి: మరి తిండి తినలేదా..?
కొడుకు: బయటకు వెళ్లిపోయాగా..? ఫ‌్రెండ్స్‌తో నచ్చిన ఫుడ్ తిన్నా.
తండ్రి: మరి మీ అమ్మ సంగతి..? ఆమె భోజనం చేసిందా, చేయలేదా..?
కొడుకు: ???
తండ్రి: నేనెప్పుడైనా మీ అమ్మతో గొడవ పడడం చూశావా..?
కొడుకు: లేదు.
తండ్రి: మనకి అన్ని విషయాలు నచ్చవు. అది ఎందులోనైనా కావచ్చు. తిండి, దుస్తులు… ఇలా ఏదైనా సరే.. అంత మాత్రాన గొడవ పడడం కరెక్టేనా..?
కొడుకు: ???
తండ్రి: తిండి నచ్చలేదని నువ్వు నీ మానాన అమ్మతో గొడవపడి వెళ్లావు, ఫ్రెండ్స్‌తో కలిసి నీకు నచ్చిన ఫుడ్ తిని వచ్చావు. మరి అమ్మ పరిస్థితి ఆలోచించావా..? ఆమె కూడా అదే తిండి తినాలిగా..! మరి ఆమె భోజనం చేసిందో, చేయలేదో తెలుసుకునే పని లేదా..? నువ్వు గొడవ పడి వెళ్లగానే మీ అమ్మ నీ గురించే ఆలోచిస్తుంది. కానీ నువ్వేమో అక్కడ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేశావు. మరి అమ్మ ఇంటి దగ్గర ఉండాలి కదా..! ఉండాలి కాదు, తానే ఉండాలని అనుకుంది. నా కోసం, మీ కోసం కెరీర్‌ను వదిలి ఇంట్లోనే ఉండి త్యాగం చేసింది. మరి ఆమె పట్ల అలాగేనా ఉండేది..? నువ్వు నీ స్నేహితులతో తిరిగి వచ్చావు, కానీ మీ అమ్మ ఇంట్లోనే కదా ఉంది, ఆమె నీలా బయటి తిండి ఉండదు కదా, స్నేహితులు కూడా లేరు, బయటకు వెళ్లదు. ఇంట్లో చేసిందే తినాలి. అంత మాత్రాన మనతో గొడవ పడిందా..? లేదు కదా..!
కొడుకు: ???
తండ్రి: నచ్చని తిండి పెడితే… నిదానంగా మాట్లాడాలి. అంతేకానీ కోపగించుకోకూడదు. నువ్వు అలా చేస్తే రోజంతా ఆమె దాని గురించే ఆలోచిస్తూ బాధ పడుతుంది. కానీ నువ్వు మాత్రం ఎంచక్కా బయట ఎంజాయ్ చేసి వచ్చావు..! నీకున్న సంతోషమైన ప్రపంచం అమ్మకు ఉండవద్దా..? ఉండాలి..! ఆమె కూడా మనలాగే సంతోషంగా ఉండాలి. అందుకు ఏం చేయాలో తెలుసుగా..?
తండ్రి ఇచ్చిన సలహా, సూచనలతో కొడుకు వెంటనే వెళ్లి తన తల్లిని క్షమాపణ కోరాడు. అటు తరువాత ఆ కొడుకు తన తల్లిని ఎప్పుడూ కోపగించుకోలేదు.