Dhaba Style Chicken Curry : చికెన్ ను మనం తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూనే ఉంటాం. చికెన్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. దేహ దారుఢ్యం కోసం వ్యాయామాలు చేసే వారికి చికెన్ ఎంతో ఉపయోగపడుతుంది. చికెన్ తో బిర్యానీ, పులావ్ లతోపాటు కూరను కూడా తయారు చేస్తూ ఉంటారు. హోటల్స్ లో, దాబాలలో చేసే చికెన్ కర్రీలో గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. మనం ఇంట్లో కూడా చాలా సులువుగా గ్రేవీ ఎక్కువగా ఉండేలా తయారు చేసుకోవచ్చు. చపాతీ, పూరీలలోకి తినడానికి ఈ విధంగా చేసే చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దాబాలో తయారు చేసే విధంగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దాబా స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అర కిలో, పసుపు – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, యాలకులు – 2, లవంగాలు – 3, దాల్చిన చెక్క – 1, తరిగిన పచ్చి మిర్చి – 3, ఉల్లిపాయ పేస్ట్ – అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, టమాట ప్యూరీ – ఒక కప్పు, కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, నీళ్లు – టీ గ్లాస్, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
దాబా స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చేసుకుని పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి అర గంట పాటు కదిలించకుండా ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు టమాట ఫ్యూరీ వేసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉంచాలి. ఈ విధంగా వేయించిన తరువాత ముందుగా ఉప్పు, పసుపు వేసి కలిపి ఉంచిన చికెన్ తోపాటు పెరుగు, కారం, పసుపు, రుచికి తగినంత మరికొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలాను వేసి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. 15 నిమిషాల తరువాత నీళ్లను, కరివేపాకును వేసి కలిపి మూత పెట్టి చికెన్ ను పూర్తిగా ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దాబా స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ తయారవుతుంది. దీనిని చపాతీ, పూరీ, పుల్కా, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉండమే కాకుండా చికెన్ లోని పోషకాలను కూడా పొందవచ్చు.