Methi Puri : మనం మెంతి ఆకును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మెంతిఆకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతికూరతో మనం వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. మెంతికూరతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మెంతిపూరీలు కూడా ఒకటి. తరుచూ చేసే పూరీల కంటే ఈ మెంతి పూరీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని కూడా అందరూ ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఈ పూరీలను తయారు చేయడం కూడా చాలా సులభం. కేవలం 15 నిమిషాల్లోనే ఈ పూరీలను తయారు చేసుకోవచ్చు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మెంతికూరతో పూరీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మేతి పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతిఆకులు – ఒక కప్పు, గోధుమపిండి – 2 కప్పులు, శనగపిండి – అర కప్పు, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మేతి పూరీ తయారీ విధానం..
ముందుగా మెంతికూర కట్ట నుండి కాడలు రాకుండా కేవలం మెంతి ఆకులను మాత్రమే తీసుకోవాలి. తరువాత వీటిని శుభ్రంగా కడిగి వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. తరువాత గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. ఇందులో కట్ చేసిన మెంతి ఆకు, ఉప్పు, కారం, పసుపు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. తరువాత దీనిపై మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత పిండిని తీసుకుని మరోసారి కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని పూరీలా వత్తుకుని వేడి నూనెలో వేసుకోవాలి. నూనెలో వేయగానే పూరీని గంటెతో లోపలికి వత్తుకోవాలి. పూరీ పొంగగానే అటూ ఇటూ తిప్పుతూ రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మేతి పూరీలు తయారవుతాయి. తరుచూ ఒకేరకం పూరీలు కాకుండా ఇలా వెరైటీగాకూడా తయారు చేసి తీసుకోవచ్చు. మెంతికూరను తినని వారు కూడా ఈ పూరీలను ఇష్టంగా తింటారు.